తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు ఏరియల్ సర్వే

By Nagaraju TFirst Published Oct 12, 2018, 2:45 PM IST
Highlights

తిత్లీ తుఫాన్ ప్రకోపానికి కకావికలమైన శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏరియల్ సర్వే నిర్వహించారు. తుఫాన్ ధాటికి తీవ్రంగా దెబ్బతిన్న జిల్లాలోని పలు ప్రాంతాలను హెలికాప్టర్ ద్వారా వీక్షించారు. 

శ్రీకాకుళం: తిత్లీ తుఫాన్ ప్రకోపానికి కకావికలమైన శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏరియల్ సర్వే నిర్వహించారు. తుఫాన్ ధాటికి తీవ్రంగా దెబ్బతిన్న జిల్లాలోని పలు ప్రాంతాలను హెలికాప్టర్ ద్వారా వీక్షించారు. 

పలాస, కాశీబుగ్గ,  మందస, వంశధారతోపాటు పలు ధ్వంసమైన ప్రాంతాలను చంద్రబాబు పరిశీలించారు. ఏరియల్ సర్వే అనంతరం చంద్రబాబు క్షేత్రస్థాయిలో పర్యటించారు. బాధితుల యోగక్షేమాలు తెలుసుకున్నారు. బాధితులకు అందుతున్న సహాయక చర్యలపై ఆరా తీశారు. 

 తుఫాన్ బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. ప్రభుత్వం ముందుగా అప్రమత్తమైందని అందువల్ల ప్రాణనష్టాన్ని నివారించగలగామని చంద్రబాబు తెలిపారు. ప్రజలు ఆందోళన చెందొద్దని అందరికీ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. 

సీఎం చంద్రబాబుతోపాటు మంత్రి నారాయణ, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడు పర్యటించారు. నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతం కావడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు గురువారం రాత్రే చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లా చేరుకున్నారు. తుఫాన్ ధాటికి తీవ్రంగా దెబ్బతిన్నశ్రీకాకుళం జిల్లాలో పునరావాస చర్యలను దగ్గరుండి పర్యవేక్షించేందుకు చంద్రబాబు జిల్లాకు చేరుకున్నారు. 

అనంతరం జిల్లా ఉన్నతాధికారులు మంత్రులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యుత్ పునరుద్ధరణ చర్యలకు సీఎం ఆదేశించారు. భారీగా విద్యుత్ స్థంభాలు కుప్పకూలిపోవడంతో వాటిని సరిచేసేందుకు ఇతర ప్రాంతాల నుంచి సిబ్బందిని తీసుకురావాలని ఆదేశించారు.  

click me!