త్వరలో రద్దు కానున్న ఏపీ కేబినెట్.. ఈ నెల 7న చివరి భేటీ, ఆపై మంత్రుల రాజీనామాలు..?

Siva Kodati |  
Published : Apr 05, 2022, 04:33 PM IST
త్వరలో రద్దు కానున్న ఏపీ కేబినెట్.. ఈ నెల 7న చివరి భేటీ, ఆపై మంత్రుల రాజీనామాలు..?

సారాంశం

ఏపీలో కేబినెట్ పునర్వ్యస్థీకరణ నేపథ్యంలో ప్రస్తుతం వున్న మంత్రిమండలి రద్దు కానుంది. ఈ నెల 7న మంత్రి మండలి చివరిసారిగా సమావేశం కానుంది. ఆ తర్వాత మంత్రులంతా తమ పదవులకు రాజీనామాలు చేయనున్నారు. 

ఏపీలో కేబినెట్ పునర్వ్యస్ధీకరణకు (ap cabinet reshuffle) రంగం సిద్ధమవుతోంది. ఈ నెల 7న ప్రస్తుత కేబినెట్‌ చివరి సమావేశం (cabinet meeting) జరగనుంది. ఇక ఆ తర్వాత ఏపి మంత్రి మండలి రద్దు కాబోతోంది. మంత్రులు తమ రాజీనామాలను సమర్పిస్తారు. ఈ నెల 8న గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్‌తో (biswabhusan harichandan) సీఎం జగన్ (ys jagan) సమావేశం కానున్నారు. మంత్రుల రాజీనామా లేఖలను గవర్నర్‌కు సమర్పిస్తారు సీఎం. అప్పుడే కొత్త మంత్రుల జాబితాను గవర్నర్‌కు అందజేస్తారు. ఏప్రిల్ 11న కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయనుంది. ఉదయం 11.31 నిమిషాలకు కొత్త మంత్రులతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. 

మరోవైపు.. మొత్తం 35 మందితో కొత్త మంత్రుల జాబితాను సిద్ధం చేసుకుంటున్నారు సీఎం జగన్. అయితే, పాత మంత్రుల్లో కొంత మందిని కొనసాగించాలని జగన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కొత్తగా 25 మందికి మాత్రమే మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది. మంత్రివర్గ పునర్వ్యస్థీకరణలో సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు సీఎం. బీసీలు, ఇతర వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. మంత్రి పదవులు కోల్పోయే ఎమ్మెల్యేలకు కీలకమైన పార్టీ బాద్యతలను జగన్ అప్పగించనున్నారు. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా మంత్రి వర్గ కూర్పు, ఇతర ఎమ్మెల్యేలకు పార్టీ బాధ్యతలు ఉంటాయని భావించవచ్చు. 

కడప జిల్లా నుంచి కోరుట్ల శ్రీనివాసులు, అంజాద్ పాషాల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా నుంచి సిదిరి అప్పలరాజును మంత్రివర్గంలో కొనసాగించే అవకాశం ఉంది. శ్రీకాకుళం జిల్లా నుంచి ధర్మాన కృష్ణదాస్ ను తప్పించి ఆయన సోదరుడు ధర్మాన ప్రసాదరావును మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మంత్రిగా ధర్మాన ప్రసాదరావుకు విశేషమైన అనుభవం ఉంది.  గుంటూరు జిల్లా నుంచి అంబటి రాంబాబు, విడుదల రజని, పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అంబటి రాంబాబు వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో జగన్ తో మొదటి నుంచి కొనసాగుతున్నారు. టీడీపీని ఎదుర్కోవడంలో అంబటి రాంబాబు కీలకమైన పాత్ర పోషిస్తూ వస్తున్నారు. 

చిత్తూరు జిల్లా నుంచి నగరి జిల్లా నుంచి రోజాకు మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది. మొదటి నుంచి వైసీపీలో కొనసాగుతూ వస్తున్నారు. తొలిసారే ఆమె మంత్రి పదవిని ఆశించారు. అయితే, ఆమెకు మంత్రిపదవి దక్కలేదు. దాంతో తీవ్రమైన మనస్తాపానికి గురైన రోజా కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. ప్రకాశం జిల్లా నుంచి ఆదిమూలపు సురేష్ ను కొనసాగిస్తారా,  సుధాకర్ బాబుకు స్థానం కల్పిస్తారా అనేది వేచి చూడాల్సిందే. నెల్లూరు జిల్లా నుంచి కాకాని గోవర్ధన్ కు జగన్ మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉంది. 

విజయనగరం జిల్లా నుంచి రాజన్న దొర లేదా కళావతి మంత్రివర్గంలో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా అబ్బయ్య చౌదరికి మంత్రివర్గంలో అవకాశం దక్కవచ్చు. తూర్పు గోదావరి జిల్లా నుంచి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణకు అవకాశం దక్కవచ్చు. తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాకు బెర్త్ ఖరారైనట్లు చెబుతున్నారు. కృష్ణా జిల్లా నుంచి జోగి రమేష్, కొలను పార్థసారథి, కొక్కలగడ్డ రక్షణనిధి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అనంతపురం జిల్లా నుంచి శంకరనారాయణను మంత్రివర్గంలో కొనసాగించాలా, ఉషాశ్రీ చరణ్ కు అవకాశం కల్పించాలా అనే ఆలోచన సాగుతోంది. కర్నూలు జిల్లా నుంచి జయరామ్ కు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అలాగే కాటసాని రాంభూపాల్ రెడ్డి, శిల్ప చక్రపాణి రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. విశాఖపట్నం జిల్లా నుంచి గుడివాడ అమర్నాథ్ కు వైఎస్ జగన్ మంత్రివర్గంలో అవకాశం దక్కవచ్చు. 

మంత్రివర్గంలో స్థానం కోల్పోయే సీనియర్ ఎమ్మెల్యేలను పార్టీ సమన్వయకర్తలుగా నియమించి, ఎన్నికలను ఎదుర్కునే బలమైన జట్టుగా తయారు చేయాలని వైఎస్ జగన్ భావిస్తున్నారు. క్షేత్రస్థాయి సమస్యలను పరిష్కరించడంతో పాటు పార్టీని గెలుపు బాటలో నడిపించే జట్టుగా అది పనిచేస్తుంది.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే