6 రకాలుగా స్కూళ్ల వర్గీకరణ, రాజమండ్రి అర్బన్ డెవలప్ అథారిటీ ఏర్పాటు: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

By Siva KodatiFirst Published Aug 6, 2021, 4:50 PM IST
Highlights

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకుంది మంత్రి మండలి. నూతన విద్యా విధానంలో స్కూళ్లను 6 రకాలుగా ఖరారు చేస్తూ కేబినెట్ ఆమోదముద్ర వేసింది

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. అనంతరం ఇందుకు సంబంధించిన వివరాలను మంత్రి పేర్ని నాని మీడియాకు వివరించారు. విద్యా వ్యవస్థ మెరుగుపర్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. నాడు - నేడు కింద 34 వేల స్కూళ్లను అభివృద్ధి చేశామని పేర్ని నాని ప్రకటించారు. రాష్ట్రంలో మెరుగైన విద్యను అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్ని నాని తెలిపారు. రెండు భాషల్లో పాఠ్య పుస్తకాలు అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీయేనని మంత్రి అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెరిగాయని .. టీచర్లను తొలగించే ప్రసక్తే లేదని పేర్ని నాని స్పష్టం చేశారు. ఏ తరగతికైనా తెలుగు తప్పనిసరిగా వుంటుందన్నారు.

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు:

నూతన విద్యా విధానంలో స్కూళ్లను 6 రకాలుగా ఖరారు చేస్తూ కేబినెట్ ఆమోదముద్ర వేసింది. వీటిలో శాటిలైట్ స్కూల్స్ (పీపీ-1, పీపీ-2), ఫౌండేషన్ స్కూల్స్ (పీపీ-1, పీపీ 2, 1, 2), ఫౌండేషన్ ప్లస్ స్కూల్స్ (పీపీ 1 నుంచి 5వ తరగతి వరకు), ప్రీ స్కూల్స్ (3 నుంచి 7 లేదా 8వ తరగతి వరకు), హైస్కూల్స్ (3 నుంచి 10వ తరగతి వరకు), హైస్కూల్ ప్లస్ (3వ తరగతి నుంచి 12వ తరగతి వరకు)

  • ప్రతి సబ్జెక్ట్‌కు ఒక టీచర్, ప్రతి తరగతికి ఒక తరగతి గది
  • రాష్ట్రంలో కొత్తగా 4,800 తరగతి గదులు
  • ఈ నెల 16న విద్యా కానుక
  • ఆగస్టు 10న మూడో విడత నేతన్న నేస్తం. ఈ పథకానికి రూ.200 కోట్లు కేటాయింపు
  • అగ్రిగోల్డ్ బాధితులకు ఇప్పటికే రూ.238 కోట్లు చెల్లింపు. రూ.20 వేల లోపు  డిపాజిట్ దారులకు ఈ నెల 24న చెల్లింపు
  • ఇకపై కాకినాడ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీగా గోదావరి అర్బన్ డెవలప్ అథారిటీ
  • రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటు
  • అభ్యంతరం లేని భూముల్లో ఆక్రమణల క్రమబద్ధీకరణకు ఆమోదం
     
click me!