ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. ఆ భూములు వెనక్కి, తిరిగి రైతులకే

By Siva KodatiFirst Published Feb 23, 2021, 2:21 PM IST
Highlights

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన  ఏపీ మంత్రి మండలి సమావేశం ముగిసింది. మూడు గంటల పాటు సుదీర్ఘంగా సాగిన సమావేశంలో కీలక నిర్ణయాలను తీసుకున్నారు. 

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన  ఏపీ మంత్రి మండలి సమావేశం ముగిసింది. మూడు గంటల పాటు సుదీర్ఘంగా సాగిన సమావేశంలో కీలక నిర్ణయాలను తీసుకున్నారు.

నవరత్నాలు అమలు క్యాలెండర్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈబీసీ నేస్తం, టిడ్కో ఇళ్ల నిర్మాణానికి 300 చదరపు అడుగుల భూమి కేటాయింపు, కాకినాడ ఎస్ఈజెడ్ భూములపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.

ఆరు గ్రామాలకు చెందిన 2,180 ఎకరాలను వెనక్కి ఇచ్చేయాలని కమిటీ నివేదిక ఇచ్చింది. దీనికి కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే త్వరలో జరగనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపైనా మంత్రి మండలి చర్చించింది. 

రాజధాని పరిధిలో అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలు పూర్తి చేసేందుకు ఏఎంఆర్డీఏకు రూ.3వేల కోట్ల బ్యాంకు గ్యారెంటీ ఇచ్చేందుకు కేబినెట్‌ అంగీకారం తెలిపింది. వైఎస్సార్‌ స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణం కోసం భాగస్వామ్య సంస్థ ఎంపికకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

కడప జిల్లాలో రెండు పారిశ్రామిక పార్కులకు భూ కేటాయింపులపై చర్చ జరిగింది. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని కేబినెట్ నిర్ణయించింది.

అనంతరం కేబినేట్ భేటీ వివరాలను మంత్రి పేర్ని నాని మీడియాకు వివరించారు. అగ్రవర్ణ పేద మహిళల  కోసం 670 కోట్లతో ఈబీసీ నేస్తం ప్రారంభిస్తున్నామని మంత్రి తెలిపారు. దీని కింద ఏటా రూ.15 వేల చొప్పున మూడేళ్లలో రూ.45 వేలు సాయం చేస్తామని నాని చెప్పారు.

45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు మహిళలకు దీనిని వర్తింపజేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. నవరత్నాల అమలు ప్రత్యేక క్యాలెండర్‌కు ఆమోదముద్ర వేశామని.. 23 పథకాలకు నెలవారీగా షెడ్యూల్ ప్రకటిస్తామని మంత్రి చెప్పారు.

నీటి కుళాయి కనెక్షన్‌ను అక్రమ లేఔట్‌లలో ఇవ్వకూడదని మంత్రి మండలి తీర్మానం చేసినట్లు ఆయన తెలిపారు. రైతు భరోసా కేంద్రాలకు అనుబంధం మల్టీ పర్పస్ ఫెసిలిటీ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. 
 

 

click me!