క్యాసినో రగడ.. కొడాలి నానిని సస్పెండ్ చేయాలి : ప్రభుత్వానికి సోము వీర్రాజు డిమాండ్

By Rajesh KFirst Published Jan 22, 2022, 2:29 PM IST
Highlights

క్యాసినో తరహా క్రీడలపై వైసీపీ ప్రభుత్వానికి మమకారం వుందన్నారు ఏపీ బీజేపీ (bjp) చీఫ్ సోము వీర్రాజు (somu verraju) . క్యాసినో పెట్టిన మంత్రిని సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆత్మకూరులో బీజేపీ కార్యకర్తలపై నిరసనగా జరిగిన ప్రజా నిరసన సభలో వైసీపీ తీరుపై సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు

క్యాసినో తరహా క్రీడలపై వైసీపీ ప్రభుత్వానికి మమకారం వుందన్నారు ఏపీ బీజేపీ (bjp) చీఫ్ సోము వీర్రాజు (somu verraju) . క్యాసినో పెట్టిన మంత్రిని సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆత్మకూరులో బీజేపీ కార్యకర్తలపై నిరసనగా జరిగిన ప్రజా నిరసన సభలో వైసీపీ తీరుపై సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతీయ సంప్రదాయాలపై ఈ ప్రభుత్వానికి మమకారం లేదని ఆయన మండిపడ్డారు. 

కాగా.. గుడివాడలోని (gudivada) తన కళ్యాణ మండపం రెండున్నర ఎకరాలు వుంటుందని.. దానిలో క్యాసినో, పేకాట వంటివి నిర్వహించినట్లు నిరూపిస్తే రాజకీయాలు వదిలేసి, పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని మంత్రి కొడాలి నాని (kodali nani) సవాల్ విసిరారు. గుడివాడలో టీడీపీ (tdp) నిజ నిర్ధారణ కమిటీ సభ్యుల రాకను నిరసిస్తూ శుక్రవారం వైసీసీ (ysrcp) శ్రేణులు ఆందోళన నిర్వహించడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో దీనిపై స్పందించారు కొడాలి నాని. 

చంద్రబాబుకు (chandrababu naidu) టైం అయిపోయిందని.. ఎప్పుడూ గెలవని వర్ల రామయ్య, ఎన్నికల్లో ఓడిపోయిన వాళ్లందరితో నిజ నిర్థారణ కమిటీ వేశారంటూ ఆయన దుయ్యబట్టారు. ప్రశాంతంగా వున్న గుడివాడలో నిజ నిర్ధారణ కమిటీ పేరుతో గొడవలు పెడుతున్నారంటూ కొడాలి నాని ఆరోపించారు. సంక్రాంతికి రాష్ట్రంలో అన్ని చోట్లా జరిగినట్లే గుడివాడలోనూ జూదం జరిగిందని ఆయన అంగీకరించారు. మహిళలతో అశ్లీల నృత్యాలు చేయిస్తున్నారని తనకు సమాచారం రావడంతో తాను స్వయంగా డీఎస్పీకి ఫోన్ చేసి అడ్డుకున్నానని కొడాలి నాని తెలిపారు. 

తన కళ్యాణ మండపంలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయో లేదో చెప్పడానికి మీడియా, గుడివాడ ప్రజలు వున్నారని .. దీనికి టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ వేయాల్సిన అవసరం లేదన్నారు. మహిళలను  అడ్డం పెట్టుకుని తెలుగుదేశం పార్టీ రాజకీయాలు చేస్తోందని ఆయన ఆరోపించారు. నాడు లక్ష్మీపార్వతిని అడ్డు పెట్టుకుని ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచారని.. నేడు భార్యను రోడ్డు మీదకు తీసుకొచ్చి చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నాడని కొడాలి నాని మండిపడ్డారు. 

మరోవైపు.. ఈ క్యాసినో సెంటర్ నిర్వహణ విషయమై టీడీపీ నేతలు శుక్రవారం నాడు నిజ నిర్ధారణ చేయడానికి గుడివాడకు వచ్చారు. క్యాసినో  నిర్వహించిన కే కన్వెన్షన్ సెంటర్ వద్ద వైసీపీ శ్రేణులు భారీగా మోహరించాయి. టీడీపీ కార్యాలయం వద్ద టీడీపీ నేతలు మోహరించారు. టీడీపీ కార్యాలయం నుండి కె కన్వెన్షన్ సెంటర్ వెళ్లేందుకు ప్రయత్నించిన మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, నక్కా ఆనంద్ బాబు, ఆలపాటి రాజా, మాజీ ఎమ్మెల్యే  బొండా ఉమా మహేశ్వరరావును పోలీసులు అరెస్ట్ చేశారు. 
 

click me!