పీఆర్సీ జీవోలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ఏపీ హైకోర్టు

By Sumanth KanukulaFirst Published Jan 22, 2022, 2:02 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ (Andhra pradesh) ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పీఆర్సీ జీవోలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు విచారణ‌కు స్వీకరించింది. సర్వీస్ బెనిఫిట్స్ తగ్గిస్తూ ఏపీ సర్కార్ జీవో జారీ చేయడంపై ఏపీ గెజిటెడ్ ఆఫీసర్స్  జేఏసీ నేత కేవీ కృష్ణయ్య హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 

ఆంధ్రప్రదేశ్ (Andhra pradesh) ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పీఆర్సీ జీవోలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు విచారణ‌కు స్వీకరించింది. సర్వీస్ బెనిఫిట్స్ తగ్గిస్తూ ఏపీ సర్కార్ జీవో జారీ చేయడంపై ఏపీ గెజిటెడ్ ఆఫీసర్స్  జేఏసీ నేత కేవీ కృష్ణయ్య హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.  విభజన చట్టం ప్రకారంగా బెనిఫిట్స్ తగ్గించవద్దని ఆ పిటిషన్‌లో కోరారు. ఇందులో ప్రతివాదులుగా ఏపీ ప్రభుత్వం, ఫైనాన్స్, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీలు, కేంద్ర ప్రభుత్వం, పే రివిజన్ కమిషన్‌ను ప్రతివాదులుగా చేర్చారు. అయితే తాజాగా కేవీ కృష్ణయ్య దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. దీనిపై వచ్చే సోమవారం హైకోర్టు విచారణ చేపట్టనుంది. 

ఇక, ఏపీ ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీని ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే శుక్రవారం విజయవాడలో సమావేశమైన వివిధ ఉద్యోగ సంఘాల నేతలు..పీఆర్సీ సాధన సమితిగా ఏర్పడి ఉద్యమ కార్యచరణను ప్రకటించాయి. ఇందులో భాగంగానే 12 మందితో స్టీరింగ్ కమిటీని కూడా ఏర్పాటు చేశాయి. ఈ నెల 24న ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు తీర్మానించాయి. పీఆర్సీని వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి 5వ తేదీ నుంచి సహాయ నిరాకరణ.. 7 నుంచి సమ్మెకు వెళ్లాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి.

మరోవైపు  ఉద్యోగ సంఘాల నేతలు శుక్రవారం ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో (ap chief secretary) సమావేశమయ్యారు.  నాలుగు జేఏసీలు కలిసి పీఆర్సీ సాధన సమితిగా ఏర్పడినట్లు సీఎస్‌కు వివరించారు. ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని  తెలిపారు. 

అనంతరం ఉద్యోగ నేత వెంకట్రామిరెడ్డి (venkatrami reddy) మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగులకు నష్టం జరుగుతుందని పోరాటానికి సిద్ధమయ్యామన్నారు. అన్ని సంఘాలు ఉమ్మడిగా కలిసి ముందుకెళ్తామని.. పీఆర్సీ జీవోలు వెంటనే నిలుపుదల చేయాలన్నదే మొదటి డిమాండ్ అని వెంకట్రామిరెడ్డి చెప్పారు. అశుతోష్ మిశ్రా కమిటీ రిపోర్ట్ ఇవ్వాలనేది రెండో డిమాండ్ అన్నారు. ప్రభుత్వం పీఆర్సీపై మళ్లీ చర్చలు జరపాలని.. జరుగుతున్న నష్టాన్ని భర్తీ చేయాలని వెంకట్రామిరెడ్డి కోరారు. గ్రామ సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 

click me!