మంత్రి నానిపై 295, 295a,153a కింద కేసు.. త్వరలోనే చట్టం కూడా: సోము వీర్రాజు

By Arun Kumar PFirst Published Sep 21, 2020, 2:02 PM IST
Highlights

మంత్రి నాని వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించాలని బిజెపి అధ్యక్షులు సోము వీర్రాజు డిమాండ్ చేశారు.

అమరావతి: హిందూ దేవాలయాలపై ఇటీవల వరుస దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే తీవ్ర విమర్శలను ఎదుర్కుంటోంది. ఇలాంటి సమయంలో తిరుమల కొండపైకి అన్యమతస్తులు వెళ్లడానికి ఇవ్వాల్సిన డిక్లరేషన్ ను తిసివేయాలని జగన్ సర్కార్ ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ ప్రతిపక్ష టిడిపి, బిజెపి, జనసేన ఆందోళనకు దిగాయి. ఈ క్రమంలోనే అగ్గికి ఆజ్యం పోసినట్లు మంత్రి కొడాలి నాని డిక్లరేషన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో తాజాగా బిజెపి ఏపీ అధ్యక్షులు సోము వీర్రాజు రాష్ట్రవ్యాప్త నిరసనకు పిలుపునిచ్చారు.  

మంత్రి నాని వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. లేదంటే సోమవారం మద్యాహ్నం 3 గంటలకు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లోని ఆంజనేయ స్వామి ఆలయాల్లో వినతి పత్రాలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అలాగే అన్ని పోలీసు స్టేషన్లలో నానిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేస్తామన్నారు.  పోలీసులు కేవలం ఫిర్యాదు తీసుకోవడమే కాదు నానిపై  295, 295a 153a కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. 

''ఆదివారం మంత్రి నాని వాడిన భాష సరి కాదు. దేవుడి మీద ఆ భాష సభ్యత కాదు. చేతికి, మెడలో రుద్రాక్షలు పెట్టుకున్న నానికి ఏం మాట్లాడుతున్నారో అర్ధం అవుతుందా?హిందువుల మనోభావాలను దెబ్బ తీసేలా వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో కూడా ఇష్టం వచ్చినట్లు దూషిస్తారు. ఆ పార్టీలోని మిగతా నాయకులు కూడా ఆయనకే సపోర్ట్ చేస్తారు. ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు'' అని వీర్రాజు పేర్కొన్నారు. 

read more   

''రాజకీయ నాయకులు ఇష్టం వచ్చిన విధంగా మాట్లాడకుండా బిజెపి త్వరలో చట్టం చేస్తుంది. ఎంత సేపు ఎదుటి వారిని తిట్టించి... నవ్వుకోవడం సమంజసమా?ఇటువంటి భాషను వాడటాన్ని బిజెపి తీవ్రంగా ఖండిస్తుంది. దేవుడి పైనా, ధర్మం పైనా నోటికొచ్చినట్లు నాని మాట్లాడుతున్నారు'' అని వీర్రాజు మండిపడ్డారు. 

''పుష్కరాలలో ముప్పై మంది మరణానికి కారకులైన వారు కూడా హిందూ ధర్మం గురించి మాట్లాడుతున్నారు. ఇటువంటి వాటిని నవ్వుకుంటూ కొంతమంది ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు ఇప్పుడు ధర్మం గురించి మాట్లాడుతున్నారు. ధర్మరాజు వంటి యన్టీఆర్‌ కు వెన్నుపోటు పొడిచినప్పుడు ధర్మం ఏమైంది. ప్రభుత్వంలో ఉండి విజయవాడలో అనేక ఆలయాలను కూల్చివేశారు. ఇప్పుడు ఏదేదో మాట్లాడుతున్న చంద్రబాబు గతంలో ఆయన చేసిన పనులను కూడా గుర్తు చేసుకోవాలి. రెండు ప్రభుత్వాల హయాంలో ఆలయాల కూల్చివేత, హిందూ ధర్మంపై దాడి కొనసాగింది'' అని వీర్రాజు మండి పడ్డారు. 

click me!