కొత్త ఉద్యోగంలో చేరి మాకు సలహాలా: అచ్చెన్నాయుడిపై ఏపీ బీజేపీ నేతల విమర్శలు

By Siva KodatiFirst Published Oct 22, 2020, 2:51 PM IST
Highlights

ఏపీలో టీడీపీ బీజేపీ నేతల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్‌ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ఏపీలో టీడీపీ బీజేపీ నేతల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్‌ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీది ముగిసిన అధ్యామని ఆయన వ్యాఖ్యానించారు.

విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన టీడీపీ జాతీయ పార్టీయో... జాతి పార్టీయో అందరికీ తెలుసంటూ ఎద్దేవా చేశారు. కొత్త ఉద్యోగంలో చేరిన అచ్చెన్నాయుడు తమకు సలహాలిస్తున్నారని..  కొత్త పిచ్చోడు పొద్దెరగడన్న రీతిలో ఆయన మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.

బీజేపీ గురించి మాట్లాడే నైతిక హక్కు టీడీపీకి లేదని విష్ణువర్థన్ రెడ్డి అన్నారు. తెలుగుదేశం ఏపీ దాటి తెలంగాణ చేరిందని ఆయన సెటైర్లు వేశారు. బీజేపీకి ఉచిత సలహాలు, సూచనలు అవసరం లేదని.. చంద్రబాబు హయాంలో 40 ఆలయాలు కూల్చేశారని ఆరోపించారు. 

ఇక తమ భుజాల మీద మిమ్మల్ని మోసే శక్తిలేదని.. బీజేపీది రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్రని విష్ణువర్థన్ రెడ్డి గుర్తుచేశారు. పూటకోమాట మాట్లాడే తీరు టీడీపీ నాయకులదని.. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో ఉంటూ హైదరాబాద్ వరదలపై చంద్రబాబు నోరు మెదపలేదని ఆయన ఆరోపించారు.

ఆయన దోచేసి రెస్ట్ తీసుకుని బయటకు వచ్చిన నాయకుడంటూ విమర్శించారు. 50 వేల ఖరీదైన చీర కట్టుకుని ఉద్యమాలు చేసే నాయకురాలు కూడా తమను విమర్శిస్తున్నారని విష్ణువర్థన్ రెడ్డి విమర్శించారు.

స్క్రోలింగ్ వీరుడు మరొకరు ఉదయం అరున్నరకే లేచి ముఖ్యమంత్రికి లేఖలు రాస్తారని... మరొకరు తానే మేధావి అన్నట్లు మాట్లాడుతారంటూ ఆయన ఎద్దేవా చేశారు. 
 

click me!