
2024 అసెంబ్లీ ఎన్నికల్లో (2024 ap assembly elections) పొత్తులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ (pawan kalyan) చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే బీజేపీ (bjp) , వైసీపీ (ysrcp) నేతలు దీనిపై రకరకాలుగా స్పందించారు. తాజాగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి (vishnuvardhan reddy) ఈ వ్యవహారంపై మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ చెప్పినట్టు బీజేపీ-జనసేన కూటమి ఎవరికోసమో త్యాగాలు చేసేందుకు సిద్ధంగా లేదన్నారు. రాష్ట్రంలో బీజేపీ-జనసేన ప్రభుత్వం ఏర్పడాలని విష్ణువర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
గతంలో టీడీపీ, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వాల తప్పుల కారణంగా రాష్ట్రం 50 ఏళ్లు వెనక్కివెళ్లిందని ఆయన విమర్శించారు. నూతనంగా ఏర్పడిన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఏపీలోనూ డబుల్ ఇంజిన్ సర్కారు రావాల్సిన అవసరం ఉందని విష్ణువర్ధన్ రెడ్డి ఆకాంక్షించారు. వచ్చే ఎన్నికల్లో ఎవరినో ముఖ్యమంత్రిని చేసేందుకు బీజేపీ, జనసేన సిద్ధంగా లేవని .. తమ వైఖరి ఇదేనని అన్నారు. రేపు (జూన్ 6) ఏపీకి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (jp nadda) , మరికొందరు జాతీయ నేతలు వస్తున్నారని ఆయన వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, జనసేన కూటమి గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు నడ్డా పర్యటన ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.
పొత్తుల విషయంలో పవన్ చేసిన వ్యాఖ్యలపై మాజీ కేంద్రమంత్రి, బిజెపి నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి స్పందించారు. జనసేనతో బిజెపి పొత్తు కొనసాగుతుందని ఆమె స్పష్టం చేసారు. ఇదే విషయాన్ని నిన్న (శనివారం) తమ మిత్రపక్ష నాయకుడు పవన్ కళ్యాణ్ కూడా స్పష్టంగా చెప్పారని అన్నారు. అయితే పొత్తు అంశంపై ఎలా వెళ్లాలనేది మాత్రం జాతీయ నాయకులు నిర్ణయిస్తారని పురంధేశ్వరి పేర్కొన్నారు. బిజెపి, జనసేన మధ్య గ్యాప్ ఉందనే ప్రచారంలో ఏమాత్రం నిజం లేదన్నారు.
రాష్ట్ర బిజెపి నాయకత్వంతో జనసేన రాష్ట్ర నాయకులు మాట్లాడుతూనే ఉన్నారన్నారు. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం కొంత గ్యాప్ ఉన్నమాట నిజమేనన్నారు. కరోనా వల్ల సోషల్ డిస్టెన్స్ పెరిగిందంటూ పవన్ సరదా వ్యాఖ్యలను పురంధేశ్వరి గుర్తుచేసారు. సమన్వయంతో బిజెపి, జనసేన పార్టీ లు ముందుకు వెళుతున్నాయని... పొత్తుల విషయంలో తమ మధ్య ఎటువంటి విబేధాలు లేవన్నారు. వచ్చే ఎన్నికల్లో ఇద్దరం కలిసే ముందుకెళతామని పురంధేశ్వరి స్పష్టం చేసారు. ఆత్మకూరు ఉపఎన్నికల్లో అభ్యర్థిపై జనసేనతో చర్చించామన్నారు. ఇక్కడ బిజెపి అభ్యర్థే బరిలో వుంటాడని... అతడికి జనసేన పార్టీ పూర్తిస్థాయిలో మద్దతు ఇస్తుందని పురంధేశ్వరి ప్రకటించారు.
ఇక వైసిపి ప్రభుత్వం స్థాయికి, పరిమితికి మించి అప్పులు చేస్తోందని పురంధేశ్వరి అన్నారు. రాష్ట్రంలో ఉన్న అరాచక పరిస్థితి వల్ల పెట్టుబడి పెట్టే అవకాశం లేదన్నారు. ఎనిమిదేళ్లు అయినా ఏపికి రాజధాని లేదన్నారు. ప్రజలు కూడా ఒక్కసారి ఆలోచించి తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నాని అన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీని అనేక రాష్ట్రాల సిఎంలు కలుస్తారు... అలాగే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా కలిసారు... ఇందులో తప్పేముందని అన్నారు. ప్రధాని, ముఖ్యమంత్రి భేటి అయినంత మాత్రాన బిజెపి, వైసిపి ఒక్కటేనని దుష్ఫ్రచారం తగదని పురంధేశ్వరి అన్నారు.