
విజయవాడ: దేశ ప్రధాని నరేంద్ర మోదీ (narendra modi), కేంద్రంలోని బిజెపి (BJP) ప్రభుత్వంపై ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. టీఆర్ఎస్ (trs) పార్టీ అధికారంలోకి వచ్చి సీఎం పదవి చేపట్టిన తర్వాత మీడియా ముందుకు రావడానికి అంతగా ఇష్టపడని కేసీఆర్ కేవలం ప్రధాని మోదీని విమర్శించేందుకే ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఇలా ప్రధానిని టార్గెట్ చేసిన కేసీఆర్ పై ఏపీ బిజెపి అధ్యక్షులు సోము వీర్రాజు (somu veerraju) స్ట్రాంగ్ కౌంటరిచ్చారు.
''దేశ ప్రధాని మోడీపై విమర్శలు చేసే అర్హత కేసిఆర్ కు లేదు. బిజెపి ప్రభుత్వ పాలనలో అభివృద్ది చెందుతున్న ఇండియావైపే ప్రపంచ దేశాలన్నీ చూస్తున్నాయి. కానీ మనదేశంలోనే కొందరు ఈ అభివృద్ధిని చూడలేకపోతున్నారు'' అంటూ కేసీఆర్ కు చురకలు అంటించారు.
''బికేర్ ఫుల్ కేసీఆర్... ప్రధాని మోదీని తరిమేస్తానంటావా? రాష్ట్రానికి అప్పులు కూడా తెచ్చుకోలేక ఆస్తులు అమ్ముకుంటూ... ఏపి ప్రజలను బ్లాక్ మెయిల్ చేసే నువ్వా ప్రధాని గురించి మాట్లాడేది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సాష్టాంగ నమస్కారం చేసిన చరిత్ర మరచిపోయావా. ఇకనైనా నోరు అదుపులో పెట్టుకో కేసీఆర్'' అంటూ సోము వీర్రాజు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
ఇక ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై కూడా వీర్రాజు విరుచుకుపడ్డారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా వుండగా ప్రత్యేక హోదాను వద్దని ప్యాకేజీ కింద వేలకోట్లు తెచ్చుకున్నారని అన్నారు. ఇప్పుడు రాజకీయాల కోసమే ఏపీకి ప్రత్యేక హోదా అంటూ అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి కొత్తగా నాటకాలు ఆడుతున్నాయని మండిపడ్డారు.
''ప్రస్తుత సీఎం జగన్ కూడా చంద్రబాబు బాటలోనే ఏపీకి కేంద్రం నుండి భారీ నిధులు తెచ్చుకున్నారు. ఇలా కేంద్రం నుండి వివిధ పధకాల కింద తెచ్చిన కోట్ల రూపాయలు ఏమయ్యాయి. వీటన్నింటిపై చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి లతో ఒకే వేదిక పై బహిరంగ చర్చకు బిజెపి సిద్దం'' అని వీర్రాజు సవాల్ చేసారు.
''ఏపీలో ఐదేళ్లు టిడిపి అధికారంలో వున్నా రాజధాని కట్టడంలో చంద్రబాబు విఫలమయ్యారు. ఇప్పుడేమో మూడు రాజధానుల పేరుతో సీఎం వైఎస్ జగన్ రాష్ట్రాన్ని నాశనం చేశారు. మీ తప్పులు బయట పడకుండా అవసరమైనప్పుడల్లా ప్రత్యేక హోదా తెరపైకి తెస్తారా? అవినీతి, అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ టిడిపి, వైసిపి నాయకులు. మీ మోసాలను, కుటుంబ పాలనను ప్రజలకు వివరిస్తాం'' అని మండిపడ్డారు.
''గురువారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఏపీలో పర్యటించి పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో నితిన్ గడ్కరీకి స్వాగతం పలికేందుకు బిజెపి తరపున అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం'' అని ఏపీ బిజెపి అధ్యక్షులు వీర్రాజు తెలిపారు.