
ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ పథకాలను తమ సొంత పథకాలుగా వైసీపీ చెప్పుకుంటోందని దుయ్యబట్టారు. గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణం, గృహా నిర్మాణాలు, రైతు భరోసా కేంద్రాలు తదితర కార్యక్రమాలన్నీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే జరుగుతున్నాయని వీర్రాజు తెలిపారు.
ఉత్తరాంధ్రలో ఒక్క పెండింగ్ ప్రాజెక్ట్‌ను కూడా వైసీపీ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయిందని ఆయన పేర్కొన్నారు. భవన నిర్మాణ కార్మికుల ఉపాధిపై దెబ్బకొట్టిన జగన్‌పై ప్రజా ఛార్జ్‌షీట్ వేస్తామని వీర్రాజు తెలిపారు. రాష్ట్రాభివృద్ధి కోసం జగన్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితి వచ్చిందన్నారు. టీడీపీ-జనసేన పొత్తుకు సంబంధించి పవన్ అభిప్రాయాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లానని సోము వీర్రాజు పేర్కొన్నారు. వారి నిర్ణయం మేరకు నడుచుకుంటామని ఆయన తెలిపారు.
ALso Read: ఈసారి ఖచ్చితంగా పొత్తులతోనే .. సీఎం ఎవరవ్వాలో ఎన్నికల తర్వాత చూద్దాం : పవన్ వ్యాఖ్యలు
కాగా కొద్దిరోజుల క్రితం .. పొత్తులకు సంబంధించి జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి మేలు జరిగే విధంగా పొత్తులు వుంటాయని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే బీజేపీ కీలక నేతలు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో చర్చలు జరిపామని నాదెండ్ల తెలిపారు. అయితే సీట్ల గురించి ఇంకా చర్చలు జరగలేదని..తమ అధినేత తీసుకునే నిర్ణయానికి కట్టుబడి వుంటామని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వమని ఆయన స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చాక ఒక మాట.. రాక ముందు మరో మాటను జనసేన మాట్లాడదని నాదెండ్ల తెలిపారు.
వైవీ సుబ్బారెడ్డి రైతుల కోసం పాదయాత్ర చేయాలని నాదెండ్ల మనోహర్ సవాల్ విసిరారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆయన తెలిపారు. దర్శిలో ఆర్ధిక ఇబ్బందుల కారణంగా వైసీపీ మహిళా సర్పంచ్ ఆత్మహత్యకు పాల్పడ్డారని నాదెండ్ల వెల్లడించారు. గ్రానైట్ క్వారీల్లో పర్సంటేజ్‌లు తీసుకుంటున్నారని.. బటన్ నొక్కడం వల్ల రాష్ట్రంలో ఎంతమందికి లబ్ది చేకూరిందని మనోహర్ ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించడం లేదని.. ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రాన్ని అంధకారం దిశగా తీసుకెళ్తున్నారని నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.