
ఉత్తరాంధ్ర జలం కోసం – జల పోరు పేరుతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో అసంపూర్ణంగా నిలిచిపోయిన తాగు సాగు నీటి ప్రాజెకులపై బీజేపీ పోరుబాటను ప్రకటించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నాయకత్వంలో ఈ యాత్ర సాగుతుంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈ నెల 7, 8, 9 తేదీలలో ఈ యాత్రను చేపట్టనున్నారు. ఈ యాత్రను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి ప్రారంభించనున్నారు. కుటుంబ పార్టీల వల్లే ఉత్తరాంధ్ర జిల్లాలో ప్రాజెక్టులు ఆగిపోయాయని బీజేపీ ఆరోపిస్తుంది. ఉత్తరాంధ్రలో అసంపూర్తిగా నిలిచిపోయిన తాగు, సాగు నీటి ప్రాజెక్టులపై పోరుబాటలో భాగంగా ఈ యాత్రను నిర్వహిస్తున్నట్టుగా బీజేపీ తెలిపింది.
ఇక, నేడు విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉగాది వేడుకలను ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో సోము వీర్రాజుతో పాటు పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీ మరింతగా పుంజుకుంటుందని అన్నారు. గుంటూరులో జిన్నా టవర్ పేరు మార్చే వరకూ బీజేపీ యువ మోర్చా ఆందోళన చేస్తుందన్నారు. ఈ నెల 4న గుంటూరులో జరగనున్న పార్టీ సమావేశంలో ఈ నిరసనలకు సంబంధించిన కార్యాచరణను ప్రకటిస్తామని ఆయన చెప్పారు. కర్నూలు జిల్లా శ్రీశైలంలో భక్తులకు ఎందుకు సౌకర్యాలు కల్పించడం లేదని ప్రశ్నించారు. త్వరలోనే తాను అక్కడ పర్యటిస్తామని వెల్లడించారు.