
విజయవాడ : ఆంద్ర ప్రదేశ్ లో గోదావరి నదిపై నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్ట్ ను తాజాగా తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. ఇటీవల భద్రాచలంలో చోటుచేసుకున్న వరదలకు పోలవరం నిర్మాణమే కారణమని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ వ్యాఖ్యలు ఇరు తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపాయి. ఇలా పోలవరంపై వివాదం సృష్టించడంవెనక భారీ కుట్ర దాగివుందని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు.
పోలవరం ప్రాజెక్టు ఎత్తు గురించి టిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్న విషయాన్ని సోము వీర్రాజు గుర్తుచేసారు. ఇలా పోలవరం గురించి ప్రశ్నించడమంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రశ్నించినట్లేనని అన్నారు. ప్రస్తుతం పోలవరం విషయంలో జరుగుతున్న పరిణామాలు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ విభజన అంశాన్ని తిరగతోడినట్లే అని అన్నారు. రాష్ట్ర విభజన బిల్లు ప్రకారం పోలవరం నిర్మాణం జరుగుతోందని వీర్రాజు పేర్కొన్నారు.
1960లో పోలవరం ముంపు మండలాలను ఖమ్మం జిల్లాలో కలిపారని... విభజన తర్వాత భద్రాచలం టెంపుల్ తో పాటు మరో రెండు మండలాలు తెలంగాణకు ఇచ్చారని గుర్తుచేసారు. కానీ పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల ముంపుకు గురయ్యే మండలాలు తెలంగాణలో వుండటంతో పునరావాసం తదితర విషయాల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం వుండటంతో వాటిపి ఏపీలో కలపడం జరిగిందని సోము వీర్రాజు వివరించారు.
read more పోలవరంతో పంటే కాదు.. భద్రాచలం, పర్ణశాల మునుగుతాయి.. కేంద్రానికి ఎన్నోసార్లు చెప్పాం: రజత్ కుమార్
పోలవరం ను వ్యతిరేకిస్తే రాష్ట్ర విభజన చట్టాన్ని ఒప్పుకోనట్లేనని వీర్రాజు పేర్కొన్నారు. అప్పుడొక మాట...ఇప్పుడొక మాట అనడం కరెక్ట్ కాదన్నారు. పోలవరం ముంపు ప్రాంతాల్లోని కొన్ని గ్రామాల ప్రజలు తెలంగాణ కలుస్తాం అంటున్నారని...వారంతా భద్రాచలం ఆలయం మీద ఆధార పడటం వల్లే అటు చూస్తున్నారని వీర్రాజు అన్నారు.
ఏపీలో విలీనం చేసిన మండలాల్లో సిపిఎం ఆందోళన చేయడం ఏమిటని సోము వీర్రాజు ప్రశ్నించారు. వారికి ఏం మాయ రోగం వచ్చింది... టిఆర్ఎస్ పార్టీతో లాలూచి పడి రోడ్డెక్కారా? అని మండిపడ్డారు. అన్నీ తెలిసి కూడా ఇలా చేస్తారా? అంటూ సిపిఎం నాయకులపై వీర్రాజు మండిపడ్డారు.
పోలవరం విషయంలో సీఎం జగన్ ఏపీ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. గతంలో చంద్రబాబు కూడా ఇలానే ప్రకటించి దెబ్బ తిన్నారన్నారు. కేంద్ర మంత్రి షెకావత్ ఏపి పర్యటన తరువాత 15రోజులకు ఒకసారి పోలవరంపై రివ్యూ చేస్తున్నారని... లోయర్ కాపర్ డ్యాం పాడైన విషయంపై అధ్యయనం జరుగుతుందన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో అవినీతి జరిగిందని జగన్ ప్రచారం చేశారు... మరి ఈమూడేళ్లలో వాటిని బయటపెట్టి ఎందుకు చర్యలు తీసుకోలేదని వీర్రాజు ప్రశ్నించారు.
పోలవరం నిర్మాణం కేంద్రం పూర్తి చేస్తుందని సోము వీర్రాజు స్పష్టం చేసారు. ఏపిలో పరిణామాలను బిజెపి జాతీయ నాయకత్వానికి వివరిస్తామని అన్నారు. పోలవరం నిర్మాణంపై వివాదం సృష్టించడం తగదని సోము వీర్రాజు అన్నారు.
ఇక నిరుపేదలకు అందించే రేషన్ బియ్యం సరఫరాలోనూ జగన్ సర్కార్ అవకతవకలకు పాల్పడుతోందని వీర్రాజు ఆరోపించారు.అర్హులైన రేషన్ బియ్యం ఇవ్వకుండా జగన్ మోసం చేస్తున్నారని అన్నారు.
పేదలకోసం రాష్ట్రాలకు కేంద్రం అందించే బియ్యాన్ని వైసిపి ప్రభుత్వం పంపిణీ చేయడం లేదన్నారు. అరకోరగా ఇచ్చే బియ్యాన్ని కూడా అర్హులకు ఇవ్వడంలేదని అన్నారు. లక్షా నలభై వేల రేషన్ కార్డులు ఇష్టం వచ్చినట్లు ఇచ్చారని... ఈ విషయంలో కేంద్రం గైడ్ లైన్స్ ను పరిగణలోకి తీసుకున్నారా? అని ప్రశ్నించారు. దాదాపు యాభై లక్షల మందికి అసలు బియ్యం అవసరం లేకున్నా ఇస్తున్నారని... వీరి నుండి తిరిగి బియ్యాన్ని సేకరించి రీసైక్లింగ్ చేసి అమ్ముకుంటున్నారని వీర్రాజు ఆరోపించారు.
కాకినాడ కేంద్రంగా రేషన్ బియ్యం అక్రమ రవాణా సాగుతోందని... ఇతర దేశానికి ఇక్కడ నుంచే భారీగా బియ్యం తరలిపోతుందని ఆరోపించారు. బియ్యం కుంభకోణంపై వాస్తవాలు ప్రజలకు వివరిస్తామన్నారు. పేదలు తినే బియ్యాన్ని పందికొక్కుల్లా తింటారా? వీటి వెనుక ఉన్న అందరి బాగోతాలు బయట పెడతామని సోము వీర్రాజు హెచ్చరించారు.