ఢిల్లీలో దీక్షకు సర్వం సిద్ధం: ఆదివారం రాత్రి హస్తినకు చంద్రబాబు

By Nagaraju penumalaFirst Published Feb 9, 2019, 8:17 PM IST
Highlights

ఆదివారం రాత్రి 7గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి రాత్రి 9.15గంటలకు ఢిల్లీ విమానాశ్రయం చేరుకొని అక్కడ నుండి ఎపిభవన్ కు చేరుకుంటారని తెలిపారు. రాత్రికి అక్కడే బస చేసి సోమవారం ఉదయం 7గంటలకు రాజఘాట్ లోని మహాత్మాగాంధీ సమాధిని సందర్శించి నివాళులు అర్పించనున్నారు. 

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పునర్విభజన చట్టంలోని హామీలను అమలు చెయ్యాలని డిమాండ్ చేస్తూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈనెల 11న ఢిల్లీలో చేపట్టనున్న ధర్మపోరాట దీక్షకు ఆంధ్రాభవన్ ప్రాంగణం ముస్తాబవుతోంది. 

సోమవారం ఉదయం 8గంటలకు చంద్రబాబు నాయుడు ధర్మపోరాట దీక్ష చేపట్టనున్నారు. ఆ దీక్ష రాత్రి 8గంటల వరకు కొనసాగనుంది. ఈ నేపథ్యంలో ధర్మపోరాట దీక్ష ఏర్పాట్లను ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్, శాసనమండలి సభ్యులు సత్యనారాయణ రాజు, ఎపి భవన్ కమిషనర్ డా. అర్జా శ్రీకాంత్, ఎపి భవన్ ఓఎస్ డి. శ్రీమతి భావన సక్సెనాలు పర్యవేక్షించారు. 

ఏపీలోని నలు దిక్కుల నుంచి ప్రజలు పెద్దఎత్తున హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్ ఆదేశించారు. 

మరోవైపు పునర్విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చెయ్యకపోవడం వల్ల రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా భవన్ అధికారులు, సిబ్బందికి వివరించారు. అంతా ఈ ధర్మపోరాట దీక్షను విజయవంతం చెయ్యాలని సూచించారు. 


రాష్ట్రం నుంచి తరలివస్తున్న ప్రజలకు ముందుగా గుర్తించిన హోటల్స్, ఇతర భవనాలలో ఏర్పాటు చేస్తున్న బస ఏర్పాట్లను, వారికి అవసరమైన భోజనవసతి, రవాణా సౌకర్యాలు చూడాలని సిబ్బందికి సూచించారు. 

దీక్షా వేదిక వద్ద అవసరమైన పెండాల్స్, పబ్లిక్ అడ్రస్ సిస్టం, పోలీసు రక్షణ వలయం, మంచినీటి సరఫరా, మీడియా లాంజ్ ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. ఇకపోతే సోమవారం ఉదయం 8గంటలకే ధర్మపోరాట దీక్ష ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆదివారం రాత్రికే సీఎం చంద్రబాబు నాయుడు ఢిళ్లీ చేరుకోనున్నట్లు తెలిపారు. 

ఆదివారం రాత్రి 7గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి రాత్రి 9.15గంటలకు ఢిల్లీ విమానాశ్రయం చేరుకొని అక్కడ నుండి ఎపిభవన్ కు చేరుకుంటారని తెలిపారు. రాత్రికి అక్కడే బస చేసి సోమవారం ఉదయం 7గంటలకు రాజఘాట్ లోని మహాత్మాగాంధీ సమాధిని సందర్శించి నివాళులు అర్పించనున్నారు. 

ఆ తర్వాత ఏపీ భవన్ లో డా.బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి ధర్మపోరాట దీక్షకు దిగనున్నారని తెలిపారు. ఈ దీక్ష రాత్రి 8గంటల వరకు కొనసాగుతుంది. మరునాడు ఫిబ్రవరి 12న మధ్యాహ్నం 12.30గంటలకు భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలవనున్నట్లు స్పష్టం చేశారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన హామీలు అమలు చెయ్యకపోవడం వల్ల రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై వివరించనున్నారు. అలాగే కేంద్రం ఇచ్చిన హామీలను అమలు చెయ్యాలని కోరుతూ వినతిపత్రం ఇవ్వనున్నట్లు రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్ స్పష్టం చేశారు. 

click me!