బూటు కాళ్లతో తన్నారు, ఐదేళ్లు బతుకుతానో చస్తానో కూడా ...: వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి

By Nagaraju penumalaFirst Published Dec 12, 2019, 11:18 AM IST
Highlights

ఒక తీవ్రవాదిని కొట్టినట్లు తనను ఐదేళ్లు పోలీసులు కొట్టారని గుర్తు చేశారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. తాను ఐదేళ్లు బతుకుతానో లేదో అన్న పరిస్థితుల్లో బిక్కుబిక్కుమంటూ గడిపానని చెప్పుకొచ్చారు వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.

అమరావతి: తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో తనపై అనేక తప్పుడు కేసులు పెట్టించారని ఆరోపించారు వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. వైసీపీ కార్యకర్త ఇంటిని కూల్చితే తాను ఆర్డీవో కార్యాలయం వద్ద నిరసనకు దిగితే తాను ఒక అధికారిని కులంపేరుతో దూషించానని కేసు పెట్టి తనను కడప జైల్లో అక్రమంగా పెట్టించారని ఆరోపించారు. 

కడప జైల్లో సింగిల్ రూమ్ కేటాయించినప్పుడు బయటకు వచ్చి కూర్చుంటే జైలర్ వచ్చి తనను ఎగిరి తన్నాడని చెప్పుకున్నారు. ఎందుకు తన్నారో చెప్పాలని తాను జైలర్ ను డిమాండ్ చేస్తే సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారని గుర్తు చేశారు వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.

జైలర్ తీరును నిరసిస్తూ తాను జైల్లోనే రెండు రోజులు పచ్చి మంచినీళ్లు ముట్టుకోకుండా నిరసనకు దిగినట్లు తెలిపారు. ఆనాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డిలు వచ్చి నిరసన ఆపేయాలని చెప్పేవరకు కొనసాగించానని తెలిపారు. 

అలాగేచిత్తూరులో వైసీపీ కార్యకర్తను పోలీసులు దారుణంగా కళ్లకు గంతలు కట్టి కొడుతున్నారని తెలియడంతో తాను ధర్నాకు దిగితే తన పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని గుర్తు చేశారు. రాత్రికి రాత్రి తనను తమిళనాడు తీసుకువెళ్లారని ఆరోపించారు. 

అలా చేసిన వాళ్లు కాలగర్భంలో కలిసిపోయారు: జగన్ పై చంద్రబాబు ఫైర్..

తమిళనాడు తీసుకెళ్లాల్సిన అవసరం ఏముందని నిలదీశారు. తనను బస్సులో కింద పడుకోబెట్టారని ఆరోపించారు. మైగ్రేన్ తో బాధపడుతున్న టేబ్లెట్ ఇవ్వాలని కోరినా కూడా పోలీసులు పట్టించుకోకుండా ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు.  

తలనొప్పిని తట్టుకోలేక తలను బస్సుకేసి కొట్టుకున్నా కూడా పట్టించుకోలేదన్నారు. అనంతరం సతివాడ పోలీస్ స్టేషన్లో పెట్టారని అక్కడ కూడా రెండు రోజులు తాను నిరసనకు దిగానని తెలిపారు.

ఒక తీవ్రవాదిని కొట్టినట్లు తనను ఐదేళ్లు పోలీసులు కొట్టారని గుర్తు చేశారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. తాను ఐదేళ్లు బతుకుతానో లేదో అన్న పరిస్థితుల్లో బిక్కుబిక్కుమంటూ గడిపానని చెప్పుకొచ్చారు. 

ఐదేళ్లపాటు తెలుగుదేశం ప్రభుత్వంలో పోలీసులు అక్రమ కేసులు పెట్టి కొట్టించిన దెబ్బలకు ఎంతో ఆందోళన చెందానని చెవిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తాను అనుభవించిన నరకం తనకు ఆ వెంకటేశ్వరస్వామికి తప్ప ఇంకెవరికి తెలియదన్నారు. 

చంద్రబాబు నాయుడు పుట్టిన ఊరికి తాను ఎమ్మెల్యేగా ఉండటం తాను చేసిన తప్పా అంటూ నిలదీశారు. ఎంతో బాధ ఉంటేగానీ తాను అవమాన కరపరిస్థితుల్లో చెప్పాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. బాధతో ఒక బాధితుడుగా తన గోడు వెల్లబోసుకుంటున్నట్లు సభలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పష్టం చేశారు.  

చంద్రబాబుకు ఇంగ్లీష్ అర్ధం కావడం లేదేమో: జగన్ సెటైర్లు...

click me!