16 నుండే ఏపి బడ్జెట్ సమావేశాలు... నోటిఫికేషన్ విడుదల

By Arun Kumar PFirst Published Jun 11, 2020, 10:04 PM IST
Highlights

కరోనా విజృంభణ, లాక్ డౌన్ కారణంగా వాయిదా పడ్డ ఏపీ బడ్జెట్ సమావేశాలను నిర్వహించేందుకు జగన్ ప్రభుత్వం సన్నద్దమయ్యింది. 

అమరావతి: కరోనా విజృంభణ, లాక్ డౌన్ కారణంగా వాయిదా పడ్డ ఏపీ బడ్జెట్ సమావేశాలను ఈనెల 16 నుంచి నిర్వహించాలని కేబినెట్ సమావేశం తీర్మానించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదలయ్యింది. ఈ నెల 16న ఉదయం 10 గంటలకు  ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. సమావేశాల ప్రారంబానికి ముందే 16నే బీఏసీ కూడా జరగనుంది.

గురువారం జరిగిన ఏపి కేబినెట్ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలపైనే కాదు మరిన్ని కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్ట్‌లో భారీగా అవకతవకలు జరిగాయని మంత్రివర్గ ఉప సంఘం కేబినెట్‌కు నివేదికను సమర్పించింది. అర్హత లేని సంస్థలకు ప్రాజెక్టులను కట్టబెట్టారని కేబినెట్ సబ్ కమిటీ పేర్కొంది. సెటాప్ బాక్సుల కొనుగోళ్లలోనూ భారీ కుంభకోణం జరిగినట్లు పేర్కొంది.

ఫైబర్ నెట్‌లో సుమారు రూ.700 కోట్ల మేర అవినీతి జరిగిందని.. చంద్రన్న తోఫా, కానుక వంటి పథకాల ద్వారా రూ.158 కోట్ల అవినీతి జరిగిందని తెలిపింది. అలాగే హెరిటేజ్ మజ్జిగ ప్యాకెట్ల ద్వారా ఏడాదికి రూ.40 కోట్లు అక్రమాలు జరిగినట్లు తేలడంతో హెరిటేజ్ మజ్జిక ప్యాకెట్ల సరఫరా, ఖర్చులపై సీబీఐ విచారణ జరపాలని కేబినెట్ నిర్ణయించింది.

 వైఎస్సార్ చేయూత పథకాన్ని ఏపీ కేబినెట్ ఆమోదించింది. దీని ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు నాలుగేళ్లలో రూ.50 వేల ఆర్ధిక సాయం అందనుంది. ఆగస్టు 12న వైఎస్సార్ చేయూత పథకం ప్రారంభం కానుంది. చిన్న వ్యాపారులకు ఆర్ధిక తోడ్పాటును అందించేందుకు జగనన్నతోడు పథకానికి కేబినెట్ ఆమోదం లభించింది. దీనిలో భాగంగా సున్నా వడ్డీ కింద పదివేల రూపాయలు చిరు వ్యాపారులకు బ్యాంకు రుణాలు అందజేయనున్నారు. ఆగస్ట్ నుంచి జగనన్న తోడు పథకం ప్రారంభమవుతుందని మంత్రి పేర్ని నాని మీడియాకు తెలిపారు.

read more   మజ్జిగ సరఫరాలో అక్రమాలపై సీబీఐ విచారణ : అసలు వాస్తవం ఇదంటూ హెరిటేజ్ వివరణ

 పేదవారందరికీ వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం కింద పౌష్టికాహారం అందివ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటుకు ఆమోదించింది.

మచిలీపట్నం, గుంటూరు, శ్రీకాకుళంలో ఉన్న నర్సింగ్ కాలేజీల్లో 282 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను మంజూరు చేస్తూ కేబినెట్ తీర్మానం చేసింది. ఏలూరు, ఒంగోలు, తిరుపతిలలో ఉన్న నర్సింగ్ స్కూల్స్‌లోనూ 144 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను మంజూరు చేసింది.

తెలుగు, సంస్కృత అకాడమీల ఏర్పాటుకు నిర్ణయించింది. రామాయపట్నం పోర్ట్ నిర్మాణానికి సంబంధించి భూసేకరణకు మంత్రిమండలి ఆమోదించింది. గండికోట రిజర్వాయర్లో 26.85 టీఎంసీల నీళ్లను నిల్వ చేసే క్రమంలో ముంపునకు గురయ్యే ఏడు గ్రామాల ప్రజలకు నష్టపరిహారం అందజేసేందుకు గాను 522.85 కోట్ల నిధులను విడుదలకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది.

వెలిగొండ ప్రాజెక్ట్‌ భూసేకరణ, నష్టపరిహారం కోసం 14 వందల 11 కోట్ల 56 లక్ష రూపాయలను సైతం కేటాయించింది. ట్యాక్స్‌లను ఎగ్గొట్టే వారి ఆటకట్టించేందుకు గాను ఏపీ స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఏర్పాటుకు, దానిలో 55 పోస్టులకు కూడా మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆలయంలో తలుపులు తెరిచే సన్నిధి గొల్లలకు వారసత్వ హక్కు కల్పించేందుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. 
 

click me!