ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. సభలో టీడీపీ సభ్యుల ఆందోళన.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి బుగ్గన

By Sumanth KanukulaFirst Published Sep 15, 2022, 9:14 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. శాసనసభ ప్రారంభం కాగానే.. స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలు చేపట్టారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. శాసనసభ ప్రారంభం కాగానే.. స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలు చేపట్టారు. అయితే నిరుద్యోగ సమస్యపై టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానం ఇచ్చింది. వాయిదా తీర్మానంపై చర్చ జరపాలని టీడీపీ ఎమ్మెల్యేలు ఆందోళన దిగారు. అయితే టీడీపీ సభ్యుల ఆందోళనల మధ్యనే ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. అయితే టీడీపీ సభ్యుల తీరును మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తప్పుబట్టారు. టీడీపీ సభ్యులు కావాలనే రచ్చ చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరారు. ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ సభ్యుల ప్రశ్నలు కూడా ఉన్నాయని అన్నారు. 

కరోనా సమయంలో సమావేశాలు జరిగినప్పుడు ప్రశ్నోత్తరాలు పెట్టమని గొడవ చేసిన టీడీపీ.. ఇప్పుడు వద్దంటోందని మండిపడ్డారు. సభలోకి ఫ్లకార్డులు తీసుకురావడంతో సరికాదని అన్నారు.

వైసీపీ ప్రభుత్వం 2లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించిందని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ పెట్టాలని టీడీపీ నేతలు సవాలు చేశారని.. ఇప్పుడు సమావేశాలను అడ్డుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ సభ్యులు సభ సమయాన్ని వృథా చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు ఆదేశాలతో సభను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ప్రజాసమస్యలపై చర్చించడం టీడీపీ ఇష్టం లేదని అన్నారు. మరోవైపు శాసనమండలి సమావేశాలు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. 

ఇక, సమావేశాల తొలి రోజే ప్రభుత్వం మూడు రాజధానులపై శాసనసభలో స్వల్పకాలిక చర్చను పెట్టే అవకాశం ఉంది. అధికార వికేంద్రీకరణను ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్న ప్రభుత్వం.. ఆ దిశగా అసెంబ్లీ సమావేశాలను వినియోగించుకోవాలని చూస్తోంది. 

మూడు రాజధానులపై సభలో సీఎం జగన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ విధంగా మూడు రాజధానులతో ప్రయోజనాలు ఉన్నాయనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఆలోచనలో జగన్ ఉన్నారు. మరోవైపు ఈ సమావేశాల్లో ప్రభుత్వం.. అధికార వికేంద్రీకరణ, మూడు రాజధానులపై కొత్త బిల్లును ప్రవేశపెట్టనుందనే ప్రచారం జోరుగా సాగుతుంది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి సమాచారం లేకపోయినప్పటికీ.. ప్రభుత్వం వైపు నుంచి అలాంటి సంకేతాలు వెలువడుతున్నాయి. 

ఐదు రోజుల పాటు జరగనున్న సమావేశాలు..!
ఈ రోజు జరగనున్న బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో.. అసెంబ్లీ సమావేశాల ఎజెండా, ఎన్ని రోజుల నిర్వహించాలనే దానిని ఖారారు చేయనున్నారు. అయితే ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం..  ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. శాసనసభ సమావేశాల్లో పరిపాలన వికేంద్రీకరణ, మూడు రాజధానులు పోలవరం సాగునీటి ప్రాజెక్టులు, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలతోపాటు పలు అంశాలపై సభలో చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశాల్లో రెవెన్యూశాఖ 4 బిల్లులను ప్రవేశ పెట్టే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే.. మూడు రాజధానుల రెఫరెండమ్‌గా అసెంబ్లీని రద్దు చేయాలని ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ కోరింది. 3 ముక్కల రాజధానిపై జగన్‌కు నమ్మకం ఉంటే అసెంబ్లీని రద్దు చేయాలని సవాల్ విసిరింది. అసెంబ్లీ సమావేశాల్లో ఇదే డిమాండ్ చేస్తామని స్పష్టం చేసింది. రాజధాని విషయంలో జగన్ మాట తప్పారని.. మూడు రాజధానుల అంశాన్ని రెఫరెండంగా తీసుకుని జగన్ ఎన్నికలకు వెళ్లాలని టీడీపీ కోరింది. 

click me!