ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో గౌరవప్రదంగా మెలగండి: అసెంబ్లీ స్పీకర్ ఆదేశాలు

By Arun Kumar PFirst Published Nov 28, 2020, 5:11 PM IST
Highlights

అసెంబ్లీ స్సీకర్ తమ్మినేని సీతారాం, మండలి ఛైర్మన్ ఫరూఖ్ పోలీసు ఉన్నతాధికారులతో అసెంబ్లీలో శనివారం సమావేశం నిర్వహించారు. 

అమరావతి: ఈ నెల 30 వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ శాసన సభ సభ సమావేశాలు జరగనున్న దృష్ట్యా కొవిడ్ నిబంధనలకు లోబడి కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టాలని శాసనమండలి చైర్మన్ ఎన్.ఎం.డి. ఫరూక్ ఆదేశించారు. అసెంబ్లీ స్సీకర్ తమ్మినేని సీతారాంతో కలిసి పోలీసు ఉన్నతాధికారులతో అసెంబ్లీలో శనివారం ఆయన సమావేశం నిర్వహించారు. 

అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ... శాసన సమావేశాల నేపథ్యంలో సమావేశాలకు హాజరయ్యే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను గుర్తించి, వారితో గౌరవప్రదంగా మెలగాలన్నారు. సున్నితమైన ప్రాంతాల్లో ఓపికతో విధులు నిర్వర్తించాలన్నారు. 

అసెంబ్లీ స్పీకర్, మండలి ఛైర్మన్  భద్రతాపరంగా తీసుకుంటున్న చర్యలను పోలీసు ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. శాసన సభ సమావేశాల భద్రతపై ఇప్పటికే పలు సమావేశాలు నిర్వహించినట్లు ఇంటెలిజెన్స్ ఓఎస్డీ శశిధర్ తెలిపారు. సీఎం, ఇతర ముఖ్యుల కాన్వాయ్ ల రిహార్షల్స్ కూడా నిర్వహించామన్నారు. ముఖ్యంగా కొవిడ్ ను దృష్టిలో పెట్టుకుని... కరోనా పరీక్షలు నిర్వహించి నెగిటివ్ రిపోర్టు వచ్చిన తరవాతే ప్రజాప్రతినిధుల భద్రతా సిబ్బంది, ఇతర పోలీసు సిబ్బందికి అనుమతిస్తున్నామన్నారు. 

గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ మాట్లాడుతూ, శాసన సభ సమావేశాల నేపథ్యంలో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికే రూట్ మ్యాప్ సిద్ధం చేశామన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వాహనాల పార్కింగ్  కోసం స్థలాలను గుర్తించామన్నారు. ముఖ్యంగా సమావేశాలు జరిగే సమయంలో అసెంబ్లీ చుట్టు పక్కల ఎటువంటి ఆందోళనలు, అసాంఘిక కార్యాకలాపాలు జరగ్గకుండా గట్టి చర్యలు చేపట్టామన్నారు. 

రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ... సమావేశాల దృష్ట్యా అసెంబ్లీ, చుట్టు పక్కల ట్రాఫిక్ అంతరాయం కలుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశాలు ప్రారంభం రోజున, ముగింపు రోజున ఎక్కువగా ట్రాఫిక్ ఉండే అవకాశముందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు. సీఎం కాన్వాయ్ రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు. 

ఈ సమావేశంలో అసెంబ్లీ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ కె.రాజేంద్రనాథ్ రెడ్డి, లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యన్నార్, ఎస్పీఎఫ్ కమాండెంట్ కె.ఎన్.రావు, విజయవాడ నగర పోలీసు కమిషనర్ బి.శ్రీనివాసరావు, గుంటూరు రేంజ్ ఐజీ త్రివిక్రమ వర్మ, గుంటూరు అర్బన్ ఎస్పీ అంజిరెడ్డి, పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  

click me!