ఏపీ అసెంబ్లీలో గందరగోళం.. టీడీపీ, వైసీపీల మధ్య ఘర్షణ.. కొట్టుకున్న ఎమ్మెల్యేలు..!!

By Sumanth KanukulaFirst Published Mar 20, 2023, 9:46 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో తీవ్ర గందరగోళం నెలకొంది. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం, ఘర్షణ చోటుచేసుకుంది.

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో తీవ్ర గందరగోళం నెలకొంది. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం, ఘర్షణ చోటుచేసుకుంది. ఇరు పార్టీలకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు కొట్టుకున్నట్టుగా తెలుస్తోంది.. టీడీపీ ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి,  వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబుల మద్య ఘర్షణ జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే డోలా బాలవీరాంజనేయస్వామిపై సుధాకర్ బాబు దాడి చేసినట్టుగా టీడీపీ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. 

ఇక, ఈ రోజు ఉదయం శాసనసభ ప్రారంభం కాగానే.. జీవో నెంబర్ 1 రద్దు చేయాలని టీడీపీ సభ్యులు నిరసన చేపట్టారు. ఈ మేరకు వాయిదా తీర్మానం ఇచ్చారు. అయితే స్పీకర్ తమ్మినేని సీతారామ్ ప్రశ్నోత్తరాలు చేపట్టేందుకు సిద్దమవ్వగా టీడీపీ సభ్యులు.. నిరసనకు దిగారు. ఈ సమయంలో టీడీపీ సభ్యుల వైఖరిపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చైర్‌కు గౌరవం ఇవ్వాలని టీడీపీ సభ్యులకు సూచించారు. అయితే తమ హక్కులను కాపాడాలని టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. స్పీకర్ పోడియం వద్దకు చేరుకని స్పీకర్‌పై పేపర్లను చించివేశారు.

అయితే టీడీపీ సభ్యులపై అధికార పక్షం సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యులు సభను అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే ఇలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. సభ సజావుగా  జరగాలంటే.. వారిని సస్పెండ్ చేయాలని కోరారు. ఈ పక్షంలోనే ఇరు పార్టీల సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. టీడీపీ ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి,  వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబుల మద్య ఘర్షణ చోటుచేసుకుంది. టీడీపీ సభ్యులపై వైసీపీ ఎమ్మెల్యే సంజీవయ్య దూసుకెళ్లగా.. మంత్రి అంటి రాంబాబు అడ్డుకున్నట్టుగా తెలుస్తోంది. 

ఇక, ఈ క్రమంలోనే శాసనసభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ క్రమంలోనే శాసనసభకు సంబంధించి ప్రసారాలు కూడా నిలిపివేశారు. ప్రస్తుతం సభ వాయిదా పడింది. 

click me!