
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే.. శాసనసభ, శాసనమండలిలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. అనంతరం సభ వాయిదా పడింది. ఆ తర్వాత శాసనసభ స్పీకర్ తమ్మినేని ఆధ్వర్యంలో బీఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎం వైఎస్ జగన్, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, జోగి రమేష్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాదరాజు, టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో 9 రోజుల పాటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో ఈ నెల 24 వరకు సమావేశాలు కొనసాగనున్నాయి. అలాగే 16వ తేదీన అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక, అసెంబ్లీలో రేపు(బుధవారం) గవర్నర్ ప్రసంగంపై తీర్మానం ఉంటుందని చీఫ్ విప్ ప్రసాదరాజు తెలిపారు. ఈ శని, ఆది వారాల్లో (18,19 తేదీల్లో) కూడా సమావేశాలు కొనసాగుతాయని చెప్పారు. ఈ నెల 21,22 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలకు సెలవు ప్రకటించినట్టుగా చెప్పారు. మరోవైపు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో 20 అంశాలపై చర్చించాలని కోరినట్టుగా అచ్చెన్నాయుడు తెలిపారు.
ఇక, బీఏసీ సమావేశం ముగిసిన తర్వాత ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది.