పవన్ నటుడైతే, చంద్రబాబు మహానటుడు .. వ్యవసాయంపై వీళ్లిద్దరి మాటలా : క్రాప్ హాలీడేపై కాకాణి క్లారిటీ

Siva Kodati |  
Published : Jun 10, 2022, 07:27 PM IST
పవన్ నటుడైతే, చంద్రబాబు మహానటుడు .. వ్యవసాయంపై వీళ్లిద్దరి మాటలా : క్రాప్ హాలీడేపై కాకాణి  క్లారిటీ

సారాంశం

కోనసీమలో క్రాప్ హాలీడే అంటూ జరుగుతున్న ప్రచారంపై ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో ఎక్కడా క్రాప్ హాలీడే పరిస్దితి లేదని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబుతో పవన్‌కు ప్యాకేజ్ కుదిరిందని కాకాణి ఆరోపించారు.   

టీడీపీ (tdp) అధినేత చంద్రబాబు నాయుడుతో (chandrababu naidu) జనసేన అధ్యక్షుడు (janasena) పవన్‌ కల్యాణ్‌కు (pawan kalyan) ప్యాకేజీ కుదిరిందని ఆరోపించారు మంత్రి కాకాణి గోవర్థన్‌ రెడ్డి (kakani govardhan reddy) . దీని వల్లే చంద్రబాబు స్క్రిప్టుకి పవన్‌ డబ్బింగ్‌ చెబుతున్నాడని కాకాణి విమర్శించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన కాకాణి.. ‘వ్యవసాయం గురించి నటుడు పవన్ ,మహానటుడు చంద్రబాబు (chandrababu naidu) మాట్లాడటం సిగ్గుచేటన్నారు. స్క్రిప్టులు చదివే వ్యక్తి రైతుల గురించి మాట్లాడటం హాస్యాస్పదమంటూ పవన్‌కు చురకలు వేశారు.  క్రాప్ హాలిడే పరిస్థితి రాష్ట్రంలో ఎక్కడుందో చెప్పాలని కాకాణి గోవర్థన్ రెడ్డి ప్రశ్నించారు. 

చంద్రబాబు రుణమాఫీ ఎగ్గొడితే పవన్ ఎందుకు ప్రశ్నించలేదని మంత్రి దుయ్యబట్టారు. దద్దమ్మని పవన్ వెనకేసుకొస్తున్నాడని.. రైతుల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నారని కాకాణి విమర్శించారు. ఒంటరిగా పోటీ చేసే దమ్ము కూడా మీకు లేదని.. చంద్రబాబుపై పవన్‌కి ప్రేమ బాగా పెరిగిపోయిందని ఎద్దేవా చేశారు. ట్రాక్టర్ల పంపిణీలో టీడీపీకి , వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి వ్యత్యాసాన్ని రైతులు చూశారని గోవర్థన్ రెడ్డి పేర్కొన్నారు. టీడీపీ పాలన అవినీతి మయమని.. వైఎస్సార్సీపీ పాలన అభివృద్ధి మయమని కాకాణి గోవర్థన్ రెడ్డి అభివర్ణించారు. 

అంతకుముందు.. వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం, చేసిన తప్పిదాలు వల్లే అన్నపూర్ణ వంటి కోనసీమలో ఈ రోజు క్రాప్ హాలీడే ప్రకటించే పరిస్థితి దాపురించిందన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ధాన్యం అమ్మిన రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించరు.... కాలువలు, డ్రెయిన్ల మరమ్మత్తులు, పూడిక తీత, గట్లు పటిష్టం వంటి పనులపై శ్రద్ధ చూపరు... రంగు మారిన ధాన్యానికి ధర ఇవ్వరు.. ఇలాంటి ఇబ్బందులతోనే కోనసీమ రైతాంగం పంట వేయకూడదనే నిర్ణయం తీసుకుందన్నారు. దాదాపు 11 ఏళ్లు తర్వాత మళ్లీ ఇలాంటి పరిస్థితులు దాపురించడం చాలా బాధాకరమని జనసేనాని అన్నారు. 

Also Read:కోనసీమ క్రాప్ హాలీడే పాపం జగన్ సర్కారుదే..: పవన్ కళ్యాణ్ సీరియస్

''తొలకరి పంట వేయలేమని కోనసీమ రైతులు ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నారు. కోనసీమ రైతు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పంట విరామ నిర్ణయాన్ని తీసుకున్నారు. అన్నం పెట్టే రైతు కోసమే ఏ ప్రభుత్వ పథకాలైన ఉంటాయి. అలాంటి అన్నదాతలే పంట పండించలేమని తేల్చి చెబుతున్నారు అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. క్రాప్ హాలీడే ప్రకటించడం చాలా అరుదుగా జరుగుతుంటుంది'' అని పవన్ కళ్యాణ్ అన్నారు.

''నాకు తెలిసి 2011లో ఒకసారి జరిగింది. దాదాపు లక్షన్నర ఎకరాల్లో పంట విరామం ప్రకటించారు. ఆనాడు గోదావరి జిల్లాల రైతుల నిర్ణయం దేశాన్ని కుదిపేసింది. దాదాపు 13 జాతీయ పార్టీల నేతలు కోనసీమకు తరలివచ్చి రైతాంగం సమస్యలు తెలుసుకున్నారు. మళ్లీ ఇలాంటి పరిస్థితి రాకూడని కొన్ని మార్గనిర్దేశకాలు చేశారు. ఇప్పుడు 11 ఏళ్లు తర్వాత మళ్లీ అలాంటి పరిస్థితే దాపురించింది. అల్లవరం, ఐ. పోలవరం, ముమ్మిడివరం, ఉప్పలగుప్తం మండలాల్లో 25 వేల ఎకరాలు, అలాగే అమలాపురం రూరల్, మామిడికుదురు, కాట్రేనికోన, సఖినేటిపల్లి మండలాల్లో 20 వేల ఎకరాలు, కడియం మండలంలో కూడా కొన్ని వందల ఎకరాల్లో రైతులు పంట విరామం ప్రకటించారు. దాదాపు 50 వేల ఎకరాలకు పైగా పంట విరామం ప్రకటించడం చూస్తుంటే పరిస్థితి ఎంత దిగజారిందో అర్ధమవుతోంది'' అంటూ పవన్ ఆందోళన వ్యక్తం చేసారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!