బాబు ఫోన్: పరకాల ప్రభాకర్ రాజీనామాకు అసలు కారణం ఇదీ

First Published 28, Jun 2018, 12:01 PM IST
Highlights

రాజీనామాను ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరినా పరకాల ప్రభాకర్ వినకపోవడం వెనక బలమైన కారణం ఉందని అంటున్నారు.

హైదరాబాద్: రాజీనామాను ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరినా పరకాల ప్రభాకర్ వినకపోవడం వెనక బలమైన కారణం ఉందని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మీడియా సలహాదారు పదవికి ఇటీవల పరకాల ప్రభాకర్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేసిన విమర్శలతో మనస్తాపానికి గురై ఆయన రాజీనామా చేసినట్లు భావించారు. పరకాల కూడా అదే కోణంలో రాజీనామా రాజీనామా లేఖ రాశారు. కానీ, అంతకన్నా బలమైన కారణం మరోటి ఉందని అంటున్నారు.

రాజీనామా లేఖను సమర్పించిన తర్వాత పరకాలతో చంద్రబాబు ఫోన్ గంటకు పైగా మాట్లాడారని, రాజీనామాని వెనక్కి తీసుకోవాలని సూచించారని చంద్రబాబు చెప్పారని అంటున్నారు.

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ భర్త అయిన పరకాల ప్రభాకర్ ఇంకా మీడియా సలహాదారుడిగా ఉన్నారంటే చంద్రబాబుకు బిజెపితో సంబంధాలు కొనసాగుతున్నట్లే కదా అని జగన్ అన్నారు. ఆ విమర్శలపై పరకాల ప్రభాకర్ మనస్తాపానికి గురయ్యారు. తనను అడ్డం పెట్టుకుని చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారని, దానికి అడ్డుకట్ట వేయడానికే తాను రాజీనామా చేశానని పరకాల ప్రభాకర్ తన రాజీనామా లేఖలో తెలిపారు. 

ఆ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి అదే రోజు పరకాలకు ఫోన్ చేసి - నాకు మీపై పూర్తి విశ్వాసం ఉంది. వెంటనే వచ్చి మీ పని మీరు చేసుకోండి అని సముదాయించినట్లు చెబుతున్నారు. అయితే, పరకాల మాత్రం వెనక్కి తగ్గలేదు. సిఎఁ ప్రత్యేక కార్యదర్శి సతీష్ చంద్రకు పంపిన రాజీనామా లేఖను పరకాల మీడియాకు విడుదల చేశారు. 

అయితే, రాజీనామాకు లేఖలో చెప్పని కారణాలు ఉన్నాయనే విషయం వెలుగు చూసింది. ముఖ్యమంత్రి ఫోన్ లో మాట్లాడిన సమయంలో ఆ విషయాలను పరకాల వివరించినట్లు తెలుస్తోంది. తాను రాష్ట్ర ప్రభుత్వ సమాచారాన్ని తన సతీమణి నిర్మలా సీతారామన్ ద్వారా కేంద్రానికి అందిస్తున్నట్లు కొంత మంది టీడీపి నేతలు వ్యాఖ్యానించారని, అది తనకు బాధ కలిగించిందని పరకాల చెప్పారని సమాచారం. పరకాలను కొనసాగించడం సరి కాదని కూడా అన్నారని తెలుస్తోంది.

అలా అన్నటువంటివారు ఎవరో తనకు చెప్పాలని, తాను వారిని మందలిస్తానని చంద్రబాబు పరకాలకు చెప్పారని అంటున్నారు. అయితే, అందుకు పరకాల ప్రభాకర్ నిరాకరించారు. తన రాజీనామాకే కట్టుబడి ఉన్నారు. ఆయన పదవీ కాలం నిజానికి జులై 4వ తేదీతో ముగుస్తుంది. అయితే, రాజీనామా చేయకుండా ఉండి ఉంటే పరకాల పదవీకాలాన్ని పొడగించేవారని అంటున్నారు. 

ఈ స్థితిలో పరకాల ప్రభాకర్ రాజీనామా వ్యవహారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల టీడీపీకి ఓ సామాజిక వర్గం దూరమవుతున్న ప్రస్తుత తరుణంలో పరకాల రాజీనామా మంచిది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

Last Updated 28, Jun 2018, 12:01 PM IST