దూసుకొస్తున్న ‘‘గజ’’.. కృష్ణపట్నంలో 2వ నెంబర్ ప్రమాద హెచ్చరిక

By sivanagaprasad kodatiFirst Published Nov 12, 2018, 12:03 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌కు మరో తుఫాను గండం పొంచి వుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా బలపడటంతో కోస్తా వణుకుతోంది. దీనికి వాతావరణ శాఖ ‘‘గజ’’ తుఫానుగా నామకరణం చేశారు.


ఆంధ్రప్రదేశ్‌కు మరో తుఫాను గండం పొంచి వుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా బలపడటంతో కోస్తా వణుకుతోంది. దీనికి వాతావరణ శాఖ ‘‘గజ’’ తుఫానుగా నామకరణం చేశారు.

ప్రస్తుతం ఇది  నెల్లూరుకు తూర్పు ఆగ్నేయంగా 1180 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో తమిళనాడు దక్షిణ కోస్తాతో పాటు, ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.

తీరం వెంట గంటకు 135 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని.. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని.. మత్య్సకారులు చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది.

మరోవైపు తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. విశాఖ, మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం ఓడరేవుల్లో రెండో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు వెనక్కిరావాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అలాగే మండలానికో ప్రత్యేక అధికారిని నియమించింది.

ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 15 నాగపట్నం-కడలూరు తీరాల మధ్య తుఫాను తీరం దాటే అవకాశం ఉందని.. కావున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రచారం చేస్తున్నారు.

మరోవైపు ‘‘గజ’’ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలర్ట్ అయ్యారు. అమరావతిలోని కమాండ్ కంట్రోల్ నుంచి ఆయన పరిస్థితిని ఎప్పటి కప్పుడు సమీక్షిస్తున్నారు.

click me!