
తిరుపతి శ్రీ వెంకటేశ్వరా జూలో జంతువులు చనిపోతున్నాయి. గడచిన నెల రోజుల్లోనే సుమారు 5 జంతువులు మృతిచెందటం గమనార్హం. ఈ మరణాలకు జంతువులకు వయస్సు అయిపోవటం కన్నా జూ సంరక్షకుల నిర్లక్ష్యమే ప్రదాన కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మృతిచెందిన జంతువుల్లో అరుదైన బెంగాల్ టైగర్, సింహాలు, తెల్లపులి పిల్లలు కూడా ఉండటం జంతు ప్రేమికులను ఆందోళనకు గురిచేస్తున్నది.
నెలరోజుల క్రితం రాజు అనే పేరున్న సింహం, బెంగాల్ టైగర్ మరణించాయి. వారం క్రితం తెల్ల పులిపిల్ల మరణించింది. రెండు రోజుల క్రితం జిరాఫీ చనిపోగా మరుసటి రోజే సింహం ఒకటి చనిపోయింది, ఐదేళ్ళ క్రితం ఈ జూలో 40 సింహాలుండగా ప్రస్తుతం 14 మాత్రమే ఉండటం గమనార్హం. వీటిల్లో కూడా 9 సింహాలు అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సిబ్బంది చెబుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం, జంతువులకు అంతుపట్టని వ్యాధులతోనే మరణిస్తున్నట్లు సమాచారం.
3 వేల ఎకరాల్లో విస్తరించిన జూలో జంతువులకు ఇవ్వాల్సిన స్ధాయిలో ఆహారం అందివ్వటం లేదని ఆరోపణలు వినబడుతున్నాయి. ఈజూలో సిహాలు, పులులు, ఏనుగులు, ఎలుగుబంట్లతో పాటు రకరకాల జంతువులు 1065 ఉన్నాయి. సింహం, పులుల్లాంటి జంతువులకు ఉదయం, సాయంత్రం, రాత్రిపూట, చికెన్, బీఫ్ తదితరాలను ఆహారంగా ఇవ్వాలి. కానీ ఉదయం, సాయంత్రం మాత్రమే ఇచ్చి రాత్రిపూట ఆహారాన్ని ఇవ్వటం లేదట.
ఇక, మిగిలిన జంతువులకు కూడా క్యారెట్, బీట్ రూట్, ఆకుకూరలు, శనగలు, జొన్న ఆహారం, రకరకాల పండ్లను మూడు పూటలా ఆహారంగా ఇవ్వాలి. కానీ నిధుల కొరత, నిర్లక్ష్యం తదితరాలతో సక్రమంగా అందివ్వటం లేదట. దాంతో కడుపునిండా ఆహారం అందక జంతువులన్నీ నిరసపడిపోతున్నాయ్. పైగా కుళ్లిపోయిన మాంసాహారం, పండ్లు, కూరగాయాలను అందిస్తున్నట్లు సమాచారం. ఒకవైపు నీరసం మరోవైపు పాడైపోయిన ఆహారం తినటం, దానికితోడు సరైన వైద్య పరీక్షలు కూడా చేయించకపోవటం వల్ల తలెత్తిన రోగాలతో జతువులు మరణిస్తున్నట్లు ఆరోపణలు వినబడుతున్నాయి.