
ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం దారుణ ఘటన వెలుగులోకి. బాలికపై పెంపుడు తల్లి పైశాచికంగా వ్యవహరించింది. చిన్నారి అనే కనికరం కూడా లేకుండా చిత్ర హింసలకు గురి చేసింది. ఈ ఘటన వెలుగులోకి రావడంతో పెంపుడు తల్లిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. వివరాలు.. జంగారెడ్డిగూడెంలోని బాలాజీ నగర్‌కు చెందిన యనమదల ధర్మరాజు, లక్ష్మీ దంపతులు.. తాడేపల్లి గూడేనికి చెందిన చిన్నారి వెంకటలక్ష్మిని దత్తత తీసుకున్నారు. కొన్నాళ్ల పాటు పాటు చిన్నారిని బాగానే చూసుకున్నారు. చిన్నారి ప్రస్తుతం బాలాజీ నగర్ మండల పరిషత్ స్కూల్‌లో రెండో తరగతి చదువుతోంది. అయితే గత కొంతకాలంగా పెంపుడు తల్లి లక్ష్మి.. చిన్నారి వెంకటలక్ష్మిని చిత్రహింసలకు గురిచేస్తూ వచ్చింది.
అయితే లక్ష్మి.. చిన్నారితో ఇంటి పనులు చేయించడం, ఒంటిపై వేడినీళ్లు పోయటం, కర్రలతో కొట్టడం, అట్ల కాడతో కాల్చడం వంటి దారుణాలకు పాల్పడుతోంది. కనీసం ప్రాథమిక చికత్స కూడా చేయించకుండా కర్కశంగా వ్యవహరించేది. ఇటీవల చిన్నారి శరీరంపై అట్ల కాడతో తీవ్రంగా కాల్చింది. ఈ నేపథ్యంలోనే శనివారం కూడా చిన్నారి నాగవెంకటలక్ష్మిని తీవ్రంగా కొట్టింది. అనంతరం చిన్నారి పాఠశాలకు వెళ్లింది. ఆడుకుంటూ పడిపోవడంతో బాలిక ఒంటిపై కాలిన గాయాలను తోటి విద్యార్థులు గమనించి ప్రధానోపాధ్యాయిని గణేష్ లక్ష్మి దృష్టికి తీసుకెళ్లారు.
ఆమె ఒంటి నిండా గాయాలు ఉండటంతో ఉపాధ్యాయులు వెంటనే పోలీసులుకు సమాచారం అందించారు. మరోవైపు ఈ విషయం తెలుసుకున్న ఐసీడీఎస్ సీడీపీవో యూఎన్ స్వర్ణకుమారి, సూపర్‌వైజర్ పి.బ్యూలా పాఠశాలకు వచ్చి చిన్నారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తన తల్లి ఇంటి పనులు చేయిస్తుందని, వేడి నీళ్లు ఒంటిపై పోస్తుందని, ఒంటిపై వాతలు పెడుతుందని చెప్పుకొని చిన్నారి బోరున విలపించింది. ఇది విన్న అక్కడున్నవారి హృదయం చలించిపోయింది.
వెంటనే బాలికను ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. అనంతరం చిన్నారిని ఏలూరు సీడీపీవో కార్యాలయానికి తరలించి పూర్తి వైద్యం చేయిస్తామని, అనంతరం చిల్డ్రన్ హోమ్‌కు తరలిస్తామని సీడీపీవో స్వర్ణకుమారి చెప్పారు. చిత్రహింసలు పెట్టిన పెంపుడు తల్లి లక్ష్మిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖాధికారులు పెంపుడు తల్లిని అదుపులోకి తీసుకుని ఆమెపై హత్యాయత్నం కేసు నమోదు చేశారని జిల్లా జాయింట్ కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు.