చర్చలు సఫలం.. సమ్మె విరమిస్తున్నట్టుగా ఉద్యోగ సంఘాల ప్రకటన.. చర్చల్లో హామీలు ఇవే..!

Published : Feb 06, 2022, 07:17 AM ISTUpdated : Feb 06, 2022, 07:20 AM IST
చర్చలు సఫలం.. సమ్మె విరమిస్తున్నట్టుగా ఉద్యోగ సంఘాల ప్రకటన.. చర్చల్లో హామీలు ఇవే..!

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనను విరమించారు. ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీతో రెండు రోజులుగా సుదీర్ఘంగా జరిపిన చర్చలు ఫలించాయి. ఈ క్రమంలోనే పీఆర్సీ సాధన సమితి తాము తలపెట్టనున్న సమ్మె నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనను విరమించారు. ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీతో రెండు రోజులుగా సుదీర్ఘంగా జరిపిన చర్చలు ఫలించాయి. ఈ క్రమంలోనే పీఆర్సీ సాధన సమితి తాము తలపెట్టనున్న సమ్మె నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. శుక్రవారం సుదీర్ఘంగా అర్ధరాత్రి వరకు మంత్రుల కమిటీ, పీఆర్సీ సాధన సమితి నాయకుల మధ్య చర్చలు జరిగాయి. తిరిగి శనివారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు చర్చలు సాగాయి. ఈ చర్చల్లో పలు అంశాలపై ఏకాభిప్రాయం కుదిరింది. శనివారి రాత్రి చర్చలు ముగిశాఖ మంత్రుల కమిటీ సభ్యులు, పీఆర్సీ సాధన సమితి నాయకులు సంయుక్తంగా సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమ్మె విరమించుకున్నట్టుగా ప్రకటించారు. నల్ల బాడ్జీలు ధరించి మంత్రుల కమిటీతో చర్చలకు హాజరైన పీఆర్సీ సాధన సమితి నాయకులు.. మీడియా సమావేశంలో వాటిని తొలగించారు. 

శనివారం ఉదయం మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్, పేర్ని నాని, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సలహాదారు చంద్రశేఖర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ, ఆర్థిక శాఖ కార్యదర్శి రావత్, జీఏడీ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌లు పలు అంశాలపై ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. అనంతరం సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసి శుక్రవారం ఉద్యోగ సంఘాలతో జరిపిన సుదీర్ఘ చర్చల సారాంశాన్ని ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల డిమాండ్లకు సంబంధించి కొన్ని వెసులుబాట్లు ఇచ్చేందుకు సీఎం అంగీకరించారు. ఆ తర్వాత మంత్రుల కమిటీ సచివాలయంలో పీఆర్సీ సాధన సమితి నాయకులతో చర్చలు జరిపింది.

ఫిట్‌మెంట్‌పై ఉద్యోగ సంఘాలు పట్టుబట్టగా.. అది ముగిసిపోయిన అంశమని మంత్రుల కమిటీ తెలిపింది. ఆ తర్వాత హెచ్‌ఆర్‌ఏపై తీవ్రమైన చర్చ సాగింది. ఉద్యోగులు అడిగినంతా హెచ్‌ఆర్‌ఏ ఇవ్వడం కుదరదని.. అలా చేస్తే ప్రభుత్వంపై చాలా భారం పడుతుందని మంత్రులు చెప్పారు. ఈ క్రమంలోనే మంత్రులు పలు ప్రాతిపాదనలు చేయగా.. ఉద్యోగ సంఘాలు వాటిని అంగీకరించలేదు. ఇలా పలుమార్లు కొత్త ప్రతిపాదనలపై చర్చలు జరిగింది. ఈ చర్చల తీరును మంత్రలు కమిటీ ఎప్పటికప్పుడూ ఫోన్ ద్వారా సీఎంకు వివరించింది. ఆయన సూచనలకు అనుగుణంగా నిర్ణయాలకు తీసుకున్నారు. చర్చలు పూర్తి అయిన తర్వాత మంత్రుల ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆమోదం తెలిపారు. 

సమావేశంలో తీసుసుకున్న నిర్ణయాలు, లభించిన హామీలు..!
-ఇదివరకు ప్రకటించిన ఫిట్‌మెంట్‌లో ఎలాంటి మార్పు ఉండదు. 
-కేంద్ర ప్రభుత్వ పీఆర్సీ విధానానికి బదులుగా.. గతంలో మాదిరిగానే ఐదేళ్లకొకసారి వేతన సవరణ
-ప్రస్తుతం ఉన్న 13 జిల్లా కేంద్రాల్లో పనిచేస్తున్నవారికి 16 శాతం హెచ్‌ఆర్ఏ వర్తింపు
-50 లక్షలకు పైబడి జనాభా ఉంటే రూ.25 వేల సీలింగ్‌తో 24 శాతం హెచ్‌ఆర్‌ఏ
-సచివాలయం, హెచ్‌ఓడీ కార్యాలయాల్లో 2024 జూన్‌ వరకు 24 శాతం హెచ్‌ఆర్‌ఏ
-సవరించిన హెచ్‌ఆర్ఏ 2022 జనవరి 1 నుంచి అమలు
-- రిటైర్డ్‌ ఉద్యోగుల్లో 70–74 వయసు వారికి 7 శాతం, 75–79  వయసు వారికి 12 శాతం అదనపు క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌ వర్తింపు
-ఉద్యోగులకు 2019 జూలై ఒకటి నుంచి 2020 మార్చి 31 మధ్యకాలంలో చెల్లించిన ఐఆర్‌ను రికవరీ చేయబోం. రూ. 5-6 వేల కోట్ల డీఏ బకాయిలు రిటైర్‌మెంట్ సమాయానికి సర్దుబాటు చేస్తారు. 
-ఉద్యోగుల పీఆర్సీ నివేదికలను జీవోలు జారీచేయగానే అందజేస్తారు
-2022 జనవరి నుంచి గ్రాట్యుటీ అమలు
-మట్టిఖర్చుల కింద రూ. 25 వేలు
-పాత పద్ధతి ప్రకారం సీసీఏ కొనసాగింపు 
-సీపీఎస్‌ను రద్దు అంశాన్ని పరిశీలించేందుకు కమిటీ ఏర్పా టు.. 2022 మార్చి 31 నాటికి రోడ్‌ మ్యాప్‌
-కాంట్రాక్టు, ఎన్‌ఎంఆర్‌ సహా ఇతర ఉద్యోగులకు సంబంధించిన కమిటీ వారి సమస్యలను సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటుంది.
-సెలవులు తదితర అలవెన్సులకు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు కార్పొరేషన్లు, సొసైటీలు, వర్సిటీలు సహా ఇతర విభాగాలకూ వర్తిస్తాయి.
-గ్రామ, వార్డు సచివాలయాల కార్యదర్శులను ఈ ఏడాది జూన్‌ 30 నాటికి క్రమబద్ధీకరించి, సవరించిన వేతనాలు అందిస్తాం. 
-ఉద్యోగులు, పెన్షనర్లు మరణిస్తే అంత్యక్రియల ఖర్చులకు రూ. 25  వేలు 
- ప్రభుత్వ ఉద్యోగుల మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ ఎక్స్‌టెన్షన్‌కు సంబంధించి త్వరలో ఉత్తర్వులు 
-ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్‌) హెల్త్‌ స్కీమ్‌ క్రమబద్ధీకరణకు చర్యలు 
-ప్రజా రవాణా విభాగానికి సంబంధించి ప్రత్యేక ఉత్తర్వులు

హెచ్‌ఆర్‌ఏ శ్లాబుల్లో మార్పులు ఇలా.. 
తొలుత..

- 5 లక్షలలోపు జనాభా ఉంటే మూలవేతనంపై 8శాతం
- 5 నుంచి 50 లక్షల జనాభా ఉంటే 16శాతం                                               
-50 లక్షలకు పైగా జనాభా ఉంటే 24శాతం   
ఇప్పుడు..
-50 వేలలోపు జనాభా ఉంటే రూ.11 వేల సీలింగ్‌తో 10 శాతం హెచ్‌ఆర్‌ఏ 
-50 వేల నుంచి 2లక్షల జనాభా వరకు రూ.13 వేల సీలింగ్‌తో 12 శాతం హెచ్‌ఆర్‌ఏ 
-2 లక్షల నుంచి 50 లక్షల వరకు రూ.17 వేల సీలింగ్‌తో 16 శాతం హెచ్‌ఆర్‌ఏ
* 50 లక్షలకు మించి ఉంటే రూ.25 వేల సీలింగ్‌తో 24 శాతం హెచ్‌ఆర్‌ఏ

మెజారిటీ అభిప్రాయంతోనే సమ్మె విరమణ..
మెజారిటీ అభిప్రాయాన్ని తీసుకుని సమ్మె విరమిస్తున్నామని పీఆర్సీ సాధన సమితి నాయకులు తెలిపారు. ఉపాధ్యాయ సంఘాల నాయకులు కూడా స్టీరింగ్‌ కమిటీలో సభ్యులుగా ఉన్నారని  చెప్పారు. కొన్ని సందర్భాల్లో భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. వారు మా ఐకాసలో సభ్యులే కాబట్టి.. వారితో చర్చించి ఆదివారం ముఖ్యమంత్రితో జరిగే సమావేశానికి తీసుకెళ్తామని చెప్పారు. ఆదివారం పీఆర్‌సీ సాధన సమితి నాయకులు అంతా ముఖ్యమంత్రిని కలిసి ధన్యవాదాలు తెలుపుతామని అన్నారు. ప్రభుత్వం పెద్ద మనసుతో తమ సమస్యలను అర్థం చేసుకుందని కొందరు పీఆర్సీ సాధన సమితి నాయకులు చెప్పారు. 

సీఎం ఉద్యోగుల డిమాండ్‌లపై సానుకూలంగా స్పందించారు.. సజ్జల
‘ఉన్నంతలో మెరుగైన పీఆర్సీనే ఇచ్చినప్పటికీ... ఉద్యోగులు ఆశించిన మేర పీఆర్సీ లేకపోవడం వల్ల వారిలో ఉన్న ఆవేదన, అసంతృప్తిని ప్రభుత్వం గుర్తించి మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది. ప్రతి అంశాన్ని లోతుగా చర్చించి నిర్ణయాలు తీసుకున్నాం. సానుకూలంగా స్పందించిన ఉద్యోగ సంఘాలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ద్యోగ సంఘాల నేతలతో జరిగిన చర్చల్లో వారు ప్రస్తావించిన ప్రతి అంశంపై లోతుగా చర్చించాం. వాటిపై ఏకాభిప్రాయానికి వచ్చాం. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమని భావించిన సీఎం వారి డిమాండ్‌లపై సానుకూలంగా స్పందించారు’ అని సజ్జల చర్చల అనంతరం మీడియా సమావేశంలో తెలిపారు.

వీరిలో అసంతృప్తి..
ఇదిలా ఉంటే ఉపాధ్యాయ సంఘాల నాయకులు కొందరు ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలతో విభేదించారు. ఏపీటీఎఫ్-1938 అధ్యక్షుడు హృదయరాజు, యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి ప్రసాద్, ఎస్టీయూ అధ్యక్షుడు సుధీర్‌బాబు మీడియా సమావేశాన్ని బహిష్కరించి వెళ్లిపోయారు. తమ డిమాండ్‌లలో మొదటిదైన 27 శాతం ఫిట్‌మెంట్‌ను సాధించుకోలేకపోయామని వారు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. 30 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏపీటీఎఫ్ అధ్యక్షుడు భానుమూర్తి, ప్రధాన కార్యదర్శి పాడురంగ వరప్రసాద్‌లు.. ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాలు చేసుకున్న ఒప్పందంపై నిరసన వ్యక్తం చేశారు. ఆ ఒప్పందాన్ని నిరసిస్తూ, డిమాండ్‌ల పరిష్కారం కసం తమతో కలిసి వచ్చే సంఘాలతో కలిసి ఉద్యమిస్తామని ఒక ప్రకటనలో తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు