బంగాళాఖాతంలో తుఫాను ఆవర్తనం... ఏపీలో మళ్లీ ఊపందుకోనున్న వర్షాలు

By Arun Kumar PFirst Published Sep 15, 2021, 10:02 AM IST
Highlights

బంగాళాఖాతంలో తుఫాను ఆవర్తనం ఏర్పడనుందని... దీని ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ లో మళ్లీ వర్షాలు పెరగనున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. 

అమరావతి: ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు మందగించాయని... అక్కడక్కడ చెదురుమదురు జల్లులు మాత్రమే కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. మరో తెలుగురాష్ట్రమైన తెలంగాణలోనూ వర్షాల పరిస్థితి ఇలాగే వుందని తెలిపారు. అయితే బుధవారం తెలంగాణలో ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ వెల్లడించింది.  

ఇదిలావుంటే ఎల్లుండి(శుక్రవారం)కల్లా ఉత్తర బంగాళాఖాతంలో తుఫాను ఆవర్తనం ఏర్పడే అవకాశం వుందని... దీని ప్రభావంతో మళ్లీ ఏపీలో వర్షాలు ఊపందుకోనున్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. అంటే మరో రెండు మూడు రోజుల్లో ఏపీలో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. 

గడిచిన కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురియగా మూడునాలుగు రోజులుగా మందగించిన విషయం తెలిసిందే. అయితే వర్షాలు తగ్గుముఖం పట్టినా గోదావరి నదికి నీరు మాత్రం పోటెత్తుతోంది. భారీగా వరద నీరు చేరడంతో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ప్రస్తుతం గోదావరి నీరు అవుట్ ఫ్లో 10,01,445 క్యూసెక్కులుగా ఉంది. దీంతో గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముందస్తుగా హెచ్చరికలు జారీ చేశారు.

 మరోవైపు బ్యారేజీ నుండి 9,11,838 క్యూసెక్కులు మిగులు జలాలను అధికారులు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. గోదావరి డెల్లా కాలువలకు 10,200 క్యూసెక్కులు సాగునీరు విడుదల చేశారు అధికారులు. ఎగువ ప్రాంతాల్లోని భద్రాచలం వద్ద గోదావరి వరద తగ్గుతోంది.  

click me!