రూ. 3,441.78 కోట్లు చెల్లించండి.. విద్యుత్ బకాయిలపై తెలంగాణను కోరిన ఏపీ..

By Sumanth KanukulaFirst Published Jan 31, 2023, 10:28 AM IST
Highlights

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న విద్యుత్ బకాయిల అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. రాష్ట్ర విభజన సమయం నుంచి ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. 

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న విద్యుత్ బకాయిల అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. రాష్ట్ర విభజన సమయం నుంచి ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. రూ. 3,441.78 కోట్ల విద్యుత్ బకాయిలను వెంటనే చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఏపీ సర్కార్ కోరింది. బకాయిలను చెల్లించడంలో తెలంగాణ వైపు విపరీతమైన జాప్యం జరిగిందని.. ఆ ఫలితంగా గత ఏడేళ్లలో అదనంగా చెల్లించాల్సిన మొత్తం రూ. 4,000 కోట్లకు పెరిగిందని పేర్కొంది. 

తెలంగాణ డిస్కమ్‌లు చెల్లించాల్సిన అసలు మొత్తం రూ. 3,441.78 కోట్ల బకాయిలకు సంబంధించి ఎలాంటి వివాదం లేదని ఏపీ జెన్‌కో అధికారులు చెబుతున్నారు. ఏపీ జెన్‌కో, తెలంగాణ జెన్‌కోకు చెందిన ఉన్నతాధికారులు ఒక ఒప్పందంపై సంతకం చేశారని.. దాని ఆధారంగా తెలంగాణ డిస్కమ్‌లు వెంటనే ఏపీ జెన్‌కోకు అసలు మొత్తాన్ని చెల్లించాలని సూచించింది.

రూ. 3,441.78 కోట్ల అసలు బకాయిపై 15 శాతం వార్షిక వడ్డీ రేటు విధిస్తున్నందున.. ఆలస్య చెల్లింపు ఛార్జీలు ఇప్పటికి దాదాపు రూ.4,000 కోట్లకు పెరిగాయని ఏపీ జెన్‌కో పేర్కొంది. అసలు మొత్తం చెల్లించడంలో జాప్యం, లేట్ పేమెంట్ చార్జీలు.. తెలంగాణ ప్రభుత్వంపై మరింత ఆర్థిక భారాన్ని కలిగిస్తుందని తెలిపింది. 

అంతేకాకుండా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ నుంచి విద్యుత్ ఉత్పత్తి, తెలంగాణ డిస్కమ్‌లకు సరఫరా చేయడానికి ఏపీ జెన్‌కో తీసుకున్న రుణాన్ని ప్రస్తావించింది. ఇందుకోసం ఏపీ జెన్‌కో తన ఫైనాన్షియర్లకు 11.5 శాతం చొప్పున నెలవారీ చక్రవడ్డీని చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. ‘‘తెలంగాణ ప్రభుత్వం తన విద్యుత్ బకాయిలను, కనీసం అసలు మొత్తాన్ని క్లియర్ చేస్తే.. ఫైనాన్షియర్‌లకు మా బకాయిలను క్లియర్ చేయడానికి ఇది మాకు ఎంతో సహాయం చేస్తుంది’’ ఏపీ జెన్‌కో పేర్కొంది. ఇక, 2023 జనవరి మొదటి వారంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యుత్ బకాయిలపై తెలంగాణ హైకోర్టులో మూడు సార్లు జాబితా చేయబడినప్పటికీ.. పలు కారణాలతో విచారణ వాయిదా పడింది.

click me!