
ఆంధ్ర ప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి కొనసాగుతోంది... ఇప్పటికే మున్సిపల్, ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలు ముగిశాయి. ప్రస్తుతం పంచాయితీ ఎన్నికలు జరుగుతున్నాయి... దీంతో గ్రామాల్లో సందడి నెలకొంది. మూడు విడతల్లో ఈ ఎన్నికలు జరుగుతుండగా ఇప్పటికే మొదటివిడత ముగిసింది... ఇవాళ (నవంబర్ 29, ఆదివారం) రెండో విడత ఎన్నికల్లో భాగంగా కీలక పోలింగ్ ప్రక్రియ జరుగుతోంది. ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభంకాగా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలుతున్నారు... తమ ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతుంది... ఆ తర్వాత ఓట్ల లెక్కింపు, పలితాల వెల్లడి ఉంటుంది.
రెండో విడత పంచాయితీ ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలోని 3803 సర్పంచ్, 29 వేలకు పైగా వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఈ విడతలో సర్పంచ్ పదవుల కోసం ఏకంగా 10 వేల మందికి పైగా పోటీ పడుతున్నారు. మొత్తం 83 లక్షలకు పైగా ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకోనున్నారు... ఇందుకోసం 37 వేలకు పైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.
పంచాయితీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఎలాంటి ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటుచేసి ఓటర్లు స్వేచ్చగా ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం కల్పి. ఇక ఎన్నికల సంఘం కూడా పారదర్శకంగా పోలింగ్ జరుపుతోంది... 9 వేలకు పైగా సిసి కెమెరాలతో పోలింగ్ సరళిని పరిశీలిస్తోంది.
పంచాయితీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో సున్నితమైన కడప జిల్లాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వీరపనాయక పల్లె మండలం పాయసంపల్లి గ్రామంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పోలింగ్ కేంద్రాల వద్దకు బయటి వ్యక్తులు వస్తున్నారని ఓ వర్గం అభ్యంతరం తెలపడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇక ఇదే జిల్లాలోని వేంపల్లి పోలింగ్ స్టేషన్ వద్ద ఓ మహిళా ఓటర్ ఆందోళనకు దిగింది. తనకు ఓటు వేయనివ్వండం లేదని సదరు మహిళ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
అనంతపురం జిల్లాలో కూడా అధికార కూటమి, ప్రతిపక్ష వైసిపి నాయకులు పరస్పర దాడులకు దిగడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. యల్లనూరు గ్రామంలో టిడిపి, వైసిపి కార్యకర్తలు వేట కొడవళ్లు, కర్రలతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు.. దీంతో పోలింగ్ కేంద్రం వద్ద ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయి.. దీంతో పోలీసులు భద్రతను పెంచారు. ఈ దాడుల్లో ఇరువర్గాలకు చెందినవారు గాయపడ్డారు... వీరిని ఆస్పత్రికి తరలించారు.