Night Curfew in AP: ఏపీలో నేటి నుంచి నైట్ కర్ఫ్యూ, ఆంక్షలు.. అమలులోకి వచ్చే నిబంధనలు ఇవే..

By Sumanth KanukulaFirst Published Jan 18, 2022, 9:51 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) నేటి నుంచి నైట్ కర్ఫ్యూ (Night Curfew) అమలు కానుంది. నైట్ కర్ఫ్యూతో పాటుగా ఇతర ఆంక్షలు కూడా నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే నేటి నుంచి ఏపీలో అమల్లోకి వచ్చే నిబంధనలను ఒకసారి చూస్తే.. 
 

ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) నేటి నుంచి నైట్ కర్ఫ్యూ (Night Curfew) అమలు కానుంది. కోవిడ్ కట్టడి చర్యల్లో భాగంగా గత వారమే నైట్ కర్ఫ్యూ, ఇతర ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే సంక్రాంతి పండగ నేపథ్యంలో నైట్ కర్ఫ్యూ అమలును వాయిదా వేశారు. ఈ క్రమంలోనే నేటి ఏపీలో నైట్ కర్ఫ్యూతో పాటుగా ఇతర ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. రోజూ రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 వరకు కర్ఫ్యూ అమలు చేయనున్నారు. అయితే అత్యవసర సేవలు, ఆస్పత్రులు, వైద్య పరీక్షా కేంద్రాలు, మందుల షాపులు, మీడియా ప్రతినిధులకు.. నైట్ కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇచ్చారు. 

ఆస్పత్రులు, మెడికల్ ల్యాబ్స్, ఫార్మసీ రంగాలు, మీడియా, పెట్రోల్‌ బంకులు, విద్యుత్ సిబ్బంది, నీటి సరఫరా, పారిశుద్ద్య సిబ్బంది, ఐటీ, ఐటీ సంబంధిత సేవలకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇచ్చారు. అత్యవసర విధుల్లో ఉండే న్యాయాధికారులు, కోర్టు సిబ్బంది, స్థానిక సంస్థలకు చెందిన సిబ్బందికి కూడా మినహాయింపు కల్పించారు. అయితే విధి నిర్వహణలో ఉన్నవారు ఐడీ కార్డును చూపాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. గర్భిణులు, చికిత్స పొందుతున్న పేషెంట్లు, విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్ల నుంచి రాకపోకలు కొనసాగించేవారు తగిన ఆధారాలు చూపడం ద్వారా వారు గమ్యస్థానాలు చేరుకునే వీలు కల్పించారు. 

ఇక, ఆంక్షలు విషయానికి వస్తే.. ప్రజలందరూ మాస్క్‌లు ధరించటం తప్పనిసరి. దీనిని అతిక్రమించిన వారికి రు.100 జరిమానా విధిస్తారు. 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్‌, మాల్స్ నిర్వహించాలి. దుకాణాలు, వ్యాపార సముదాయాల్లో కోవిడ్ ఆంక్షలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. వ్యాపార, వాణిజ్య సంస్థల యాజమాన్యాలు తమ ఆవరణలో ఉన్న వారంతా మాస్కులు ధరించేలా చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు జరిమానా విధిస్తారు. 

ప్రజారవాణా వాహనాల్లో సిబ్బందితో పాటు, ప్రయాణికులూ మాస్క్‌లు ధరించాలి. వివాహాలు, శుభకార్యాలు, మతపరమైన కార్యక్రమాల విషయానికొస్తే బహిరంగ కార్యక్రమాల్లో 200 మందికి, ఇండోర్‌ కార్యక్రమాల్లో 100 మందికి మించకూడదు. 

ఇక, ఏపీలో గడిచిన 24 గంటల్లో 22,882 నమూనాలను పరీక్షించగా.. 4,108 మందికి కరోనా నిర్దారణ అయింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 21,07,493కి చేరింది. కొత్తగా 696 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కరోనాను జయించినవారి సంఖ్య.. 20,62,801కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంల 30,182 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

click me!