
అమరావతి: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం చేపట్టిన తొలి విదేశీ పర్యటన (Foreign Tour) విజయవంతమైంది. దుబాయ్ ఎక్స్ పో-2020లో (Dubai Expo - 2020) పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సత్తా చాటారు. మంత్రి సారథ్యంలో పరిశ్రమల శాఖ అధికారుల బృందం 400 మందికి పైగా పారిశ్రామికవేత్తలను కలిసింది. రోడ్‌షోలు, సీఎక్స్ వో, బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశాలు, చర్చా కార్యక్రమాలు నిర్వహించింది. సీఎం వైఎస్ జగన్ పాలనలో రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న సరికొత్త విధానాలు, సంస్కరణలు, పెట్టుబడులకు అనుకూలంగా మారిన వాతావరణాల గురించి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంతర్జాతీయంగా తన గొంతు వినిపించారు. ఇందులో ఆయన సఫలీకృతం అయ్యారు.
ఈ పర్యటనలో రీజెన్సీ గ్రూప్, ముల్క్ హోల్డింగ్స్, షరాఫ్ గ్రూప్, తబ్రీద్, కాజస్ ఈ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం రూ. 5,150 కోట్ల పెట్టుబడుల (Investments)ఒప్పందాలు కుదుర్చుకున్నది. ఈ ఒప్పందాల ద్వారా 3,400 మందికి ప్రత్యక్షంగా, మరో 7,800 మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది. జిప్సమ్ బోర్డు బిల్డింగ్ మెటీరియల్స్, కన్యూజమర్ అండ్ ఇండస్ట్రియల్ పాకేజింగ్ యూనిట్, ఆటోమేటివ్, బ్యాటరీస్, ఫ్రీ ఫ్యాబ్రికేటెడ్ స్ట్రక్చర్స్ డెవలప్‌మెంట్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లోని పలు కంపెనీలు కూడా ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నాయని అధికారులు తెలిపారు. అదే జరిగితే.. మరో రూ. 10,350 కోట్ల వరకూ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. తద్వార మరో 5,740 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇంకో 10 వేల మందికి ఉద్యోగాలు వస్తాయని వివరించారు.
పోర్టులు, ఎయిర్‌పోర్టులు, లాజిస్టిక్ హబ్‌లు, ఫిషింగ్ హార్బర్లు, పారిశ్రామిక పార్కులు, కారిడార్లు వంటి సకల సదుపాయాలు, మౌలిక సదుపాయాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దుబాయ్ ఎక్స్ పో ద్వారా మరిన్ని పెట్టుబడులు రానున్నాయని పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ వివరించారు. ప్రైవేటు రంగంలో పెట్టుబడులపైనా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్టు ఆయన తెలిపారు.
పాదర్శక పారిశ్రామిక విధానం, సుపరిపాలన, అవినీతి రహిత పాలన, సమృద్ధిగా సహజ వనరుల వల్ల ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల ప్రవాహం సాధ్యం అవుతున్నదని ఏపీఈడీబీ సీఈవో సుబ్రమణ్యం జవ్వాది వివరించారు. భవిష్యత్‌లో ఆటోమొబైల్స్, టెక్స్‌టైల్స్, స్టీల్ ప్లాంట్, పెట్రో కెమికల్, ప్రజారోగ్యం, ఐటీ వంటి రంగాల్లో ఇన్వెస్ట్‌మెంట్‌లకు ఆంధ్రప్రదేశ్ చిరునామాగా మారుతుందని అన్నారు.
ఇదిలా ఉండగా, దుబాయ్ ఎక్స్ పో - 2020లో ఆంధ్రప్రదేశ్ పెవిలియన్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ప్రతి రోజూ 7 వేల నుంచి 10 వేల మంది పెవిలియన్‌ని విజిట్ చేశారని అధికారులు తెలిపారు. దేశంలోని ఎన్నో రాష్ట్రాలు పెవిలియన్‌లను నిర్వహించినా.. దుబాయ్ వాణిజ్య శాఖ మంత్రి వచ్చి బిన్ అహ్మద్ ఏఐ జియోది, యూఏఈ విదేశీ వాణిజ్య శాఖ మంత్రి అహ్మద్ అబ్దుల్ రహ్మాన్ అల్బాణా హాజరవ్వడం ప్రత్యకతను సంతరించుకున్నదని వివరించారు. ఏపీ పెవిలియన్ ప్రారంభోత్సవానికి మాత్రమే హాజరైన పెవిలియన్ ప్రారంభించడం విశేషమని పేర్కొన్నారు.