Andhra pradesh: స్థానిక ఎన్నికలపై చంద్రబాబు ఫోకస్.. బీసీలకు 40 శాతం సీట్లు

Published : Oct 11, 2026, 10:39 PM IST
Andhra pradesh

సారాంశం

Andhra pradesh: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కసరత్తు ముమ్మరం చేశారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జులు, అబ్జర్వర్లు, పార్టీ ముఖ్య నేతలతో వర్చువల్ సమావేశం నిర్వహించారు.

స్థానిక ఎన్నికలే కీలకం.. నేతల పనితీరుకు రేటింగ్స్

స్థానిక సంస్థల ఎన్నికలను ఎవరూ తేలికగా తీసుకోవద్దని సీఎం చంద్రబాబు పార్టీ నేతలకు స్పష్టం చేశారు. కూటమి బలం మరింత పెరగాలంటే ఈ ఎన్నికల్లో విజయం సాధించడం కీలకమని పేర్కొన్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతం కంటే స్థానిక ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు. ఎన్నికల్లో నేతల పనితీరుకు రేటింగ్స్ ఇస్తామని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని చెప్పారు.

రాబోయే 50 రోజులు ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాలని, ఎవరికీ మినహాయింపు ఉండదని స్పష్టం చేశారు. అభ్యర్థుల ఎంపికలో గెలిచే అవకాశాలతోపాటు నిజాయితీ, సమర్థత, ప్రజల్లో ఉన్న ఆదరణ, సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడించారు. నిబద్ధతతో పనిచేయకుండా కేవలం హడావుడి చేసే నాయకుల వల్ల పార్టీకి ఉపయోగం ఉండదని, అలాంటి వారిని ఉపేక్షించబోమని హెచ్చరించారు. స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

బీసీలకు 40 శాతం సీట్లు.. రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ప్రాధాన్యం కల్పించడంపై చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర జనాభాలో దాదాపు సగం మంది బీసీలు ఉన్నారని, వారి రాజకీయ నాయకత్వాన్ని పెంచేందుకు స్థానిక ఎన్నికలు మంచి వేదికగా నిలుస్తాయని పేర్కొన్నారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతానికి మించి స్థానాలు కల్పిస్తామని గతంలో ప్రకటించామని, ఇప్పుడు పార్టీ పరంగా 40 శాతం వరకు సీట్లు ఇచ్చేలా కసరత్తు చేస్తున్నామని వెల్లడించారు.

బీసీలకు న్యాయం చేయడంతోపాటు ఎస్సీ, ఎస్టీల ప్రయోజనాలకు ఎలాంటి భంగం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాజీవ్ రంజన్ మిశ్రా కమిటీ సిఫార్సులను ఆమోదించి బీసీలకు సాధ్యమైనంత మేలు చేసే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. గతంలో ఎన్టీఆర్ స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు చర్యలు తీసుకున్నారని, అనంతరం ఉమ్మడి రాష్ట్రంలో వాటిని 34 శాతానికి పెంచామని గుర్తుచేశారు.

బీసీ రిజర్వేషన్ల విషయంలో వైసీపీ ప్రభుత్వం అన్యాయం చేసిందని చంద్రబాబు ఆరోపించారు. గతంలో 34 శాతంగా ఉన్న బీసీ రిజర్వేషన్లను 24 శాతానికి తగ్గించిందని విమర్శించారు. బీసీలకు కూటమి ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను ప్రజలకు వివరించేందుకు 'జయహో బీసీ.. జనాభాలో సగం-కూటమి ఇచ్చింది బలం' అనే నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేపట్టాలని నేతలకు సూచించారు.

ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి

కూటమి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను స్థానిక ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా వివరించాలని చంద్రబాబు ఆదేశించారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని, స్థానిక ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తే ట్రిపుల్ ఇంజిన్ ప్రభుత్వంగా అభివృద్ధి మరింత వేగవంతమవుతుందని పేర్కొన్నారు.

సంక్షేమం కోసం రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేశామని, అంతే మొత్తంలో అభివృద్ధి పనులు చేపట్టామని సీఎం తెలిపారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేసి ప్రజలకు ప్రయోజనం కల్పించామని, వాటి వివరాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలని సూచించారు. చెత్త పన్ను రద్దు, రహదారుల అభివృద్ధి, సాగునీటి రంగానికి పూర్వ వైభవం తీసుకొచ్చే చర్యలు, భోగాపురం విమానాశ్రయ పనుల పురోగతి వంటి అంశాలను ప్రజలకు వివరించాలని చెప్పారు.

గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పల్లె పండుగ కార్యక్రమం కింద సుమారు రూ.11 వేల కోట్లతో పనులు చేపట్టామని తెలిపారు. జేజేఎం పనులకు రూ.30 వేల కోట్లతో శంకుస్థాపన చేసినట్లు పేర్కొన్నారు. ఐదు లక్షల ఇళ్లలో సామూహిక గృహప్రవేశాలు నిర్వహించామని, మరో మూడు లక్షల ఇళ్లకు భూమిపూజ చేశామని వెల్లడించారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మౌలిక సదుపాయాల కోసం రూ.11,359 కోట్ల పనులు చేపట్టినట్లు వివరించారు.

భూ సమస్యల పరిష్కారంలో భాగంగా ఇప్పటివరకు 16.48 లక్షల ఎకరాలను 22ఏ జాబితా నుంచి తొలగించినట్లు సీఎం తెలిపారు. విశాఖపట్నం, విజయవాడ, మంగళగిరి ప్రాంతాల్లో రూ.52 వేల కోట్ల విలువైన ఆస్తులకు సంబంధించి 60 వేల మందికి పూర్తి హక్కులు కల్పించేలా పట్టాలు ఇచ్చామని పేర్కొన్నారు. వ్యక్తిగత భద్రత, కుటుంబ సాధికారత, గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, ఈ అంశాలను ప్రజలకు వివరించాలని నేతలకు సూచించారు.

కూటమి పార్టీల మధ్య సమన్వయం.. గెలిచే అభ్యర్థులకే అవకాశం

స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీలన్నీ సమన్వయంతో ముందుకు సాగాలని చంద్రబాబు స్పష్టం చేశారు. టీడీపీతోపాటు కూటమిలోని ఇతర పార్టీల నాయకులు పరస్పరం సహకరించుకుంటూ ప్రచారం నిర్వహించాలని సూచించారు. వివిధ స్థాయిల్లో ఉన్న సమన్వయ కమిటీలను క్రియాశీలం చేయాలని, రాష్ట్రస్థాయిలో ఉన్న సమన్వయం క్షేత్రస్థాయిలోనూ కనిపించాలని చెప్పారు.

పార్టీల మధ్య విభేదాలు, అపోహలకు తావివ్వకుండా నాయకులు వ్యవహరించాలని సూచించారు. కూటమి అధిష్ఠానాలు నిర్ణయించిన అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆదేశించారు. అభ్యర్థుల ఎంపికలో గెలుపు అవకాశాలకు ప్రాధాన్యం ఇస్తామని, పార్టీ నిర్ణయానికి కట్టుబడి పనిచేయాలని స్పష్టం చేశారు.

తటస్థంగా ఉన్న ఓటర్లను కూటమికి అనుకూలంగా మార్చుకోవాలని, ప్రత్యర్థి పార్టీలకు మద్దతుగా ఉన్నవారిలోనూ ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా విశ్వాసం పెంచాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, వాటి పరిష్కారానికి కృషి చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. స్థానిక ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా ప్రతి నాయకుడు, కార్యకర్త బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు.

వైసీపీ ఫేక్ ప్రచారాన్ని తిప్పికొట్టాలి

స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వైసీపీ తప్పుడు ప్రచారాన్ని పెంచే అవకాశం ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. వైసీపీ రాజకీయంగా బలహీనపడిందని, అందుకే కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తోందని విమర్శించారు. ప్రత్యర్థుల ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొడుతూ, వాస్తవాలను ప్రజలకు వివరించాలని పార్టీ నేతలకు సూచించారు.

బీసీ రిజర్వేషన్ల విషయంలో వైసీపీ కోర్టులను ఆశ్రయించి స్థానిక ఎన్నికలకు అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నించిందని చంద్రబాబు ఆరోపించారు. బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వం రిజర్వేషన్ల అంశంపై చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. అక్రమ ఆస్తులు సంపాదించుకున్నారంటూ జగన్‌పై విమర్శలు చేసిన చంద్రబాబు, తమ ప్రభుత్వంపై వైసీపీ చేస్తున్న ఆరోపణలను ఖండించారు.

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును ప్రస్తావిస్తూ, ఈ కేసులో అంతిమంగా లబ్ధి పొందింది ఎవరో ప్రజలు ఆలోచించాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తన చేతిలో కత్తి పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఈడీని తమ ప్రభుత్వమే పంపిందంటూ వైసీపీ చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని పేర్కొన్నారు. జగన్ హయాంలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, వ్యాపారవేత్తలు జైళ్లకు వెళ్లారని విమర్శించారు.

ఈ ఎన్నికల్లో అభివృద్ధిని అడ్డుకునే శక్తులకు, రౌడీ రాజకీయాలకు ప్రజలు తగిన సమాధానం చెప్పేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతోపాటు ప్రత్యర్థుల ఆరోపణలకు వాస్తవాలతో సమాధానం చెప్పాలని సూచించారు. స్థానిక ఎన్నికల్లో కూటమి విజయం సాధించేలా సమష్టి కృషి చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

రంపచోడవరం నియోజకవర్గంలో సామాన్యుడిలా పవన్ అడవితల్లిబాట | Adavi Thallibata 2.0 Launch
మీరొస్తే మాకు పెద్ద పండగ సారూ..ఈ మహిళా స్పీచ్ కి పడిపడి నవ్విన పవన్ | Adavi Thallibata 2.0 Launch