
కర్నూలు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లాయర్ వెంకటేశ్వర్లు అనుమానస్పద స్థితిలో మృతిచెందడం కలకలం రేపుతోంది. మూడు రోజుల క్రితం కనిపించకుండా పోయిన వెంకటేశ్వర్లు మృతదేహం.. కర్నూలు శివారులో లభ్యమైంది. వెంకటేశ్వర్లను హత్య చేసి రోడ్డు పక్కన పడేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మూడు రోజుల క్రితం వెంకటేశ్వర్లు కనిపించకుండాపోయారు. చింతకుంటలో తమ్ముని వద్దకు వెళ్లి తిరిగివస్తూ కనిపించకుండా పోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
వెంకటేశ్వర్లు గురించి ఎంత వెతికిన ఆచూకీ లభించకపోవడంతో.. కుటుంబ సభ్యులు మహానంది పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేసారు.దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అయితే ఈరోజు కర్నూలు శివారులోని పంట పొలం మృతదేహం ఉందని సమాచారం రావడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దీనిపై వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందివ్వడంతో అక్కడికి చేరుకున్న వారు.. మృతదేహాన్ని గుర్తించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. వెంకటేశ్వర్లు కర్నూలులోని టెలికం నగర్‌లో నివాసం ఉంటున్నారు. రియల్ ఎస్టేట్ వివాదాలకు సంబంధించిన కేసులను ఆయన వాదిస్తున్నారని తెలుస్తోంది. ఆయనను ఎవరో హత్య చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.