ఏబీ వెంకటేశ్వరరావు కేసు: సీఎస్, డీజీపీ, కేంద్ర హోం సెక్రటరీలకు ఏపీ హైకోర్టు నోటీసులు

By narsimha lodeFirst Published Apr 23, 2020, 10:55 AM IST
Highlights

రాష్ట్రంలో ప్రభుత్వం మారితే ఇంటలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును బదిలీ చేయడం, జీత భత్యాలను నిలిపివేయడం వంటివి సరికాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ విషయమై పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.

అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వం మారితే ఇంటలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును బదిలీ చేయడం, జీత భత్యాలను నిలిపివేయడం వంటివి సరికాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ విషయమై పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.

బుధవారం నాడు జస్టిస్ రాకేష్‌కుమార్ , జస్టిస్ ఎన్. జయసూర్యలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్ పై విచారణను పది రోజులకు వాయిదా వేసింది.

తనను కక్షసాధింపుతో రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసిందని, తిరిగి విధుల్లోకి తీసుకోనేలా ఆదేశాలు జారీ చేయాలని ఏబీ వెంకటేశ్వరరావు హైకోర్టును ఆశ్రయించారు.ఈ పిటిషన్ పై హైకోర్టు ధర్మాసనం విచారణ చేసింది. తనను సస్పెండ్ చేస్తూ జారీ చేసిన జీవోతో పాటు క్యాట్ జారీ చేసిన ఉత్తర్వులను కూడ రద్దు చేయాలని  ఆయన హైకోర్టును  కోరారు.

ఈ పిటిషన్ పై బుధవారం నాడు హైకోర్టు విచారణ చేసింది.  ఏబీ వెంకటేశ్వరరావు తరపున సీనియర్ న్యాయవాది బి. ఆదినారాయణరావు వాదించారు.  సస్పెన్షన్ కు ముందు అఖిలభారత సర్వీస్ నిబంధనల మేరకు అభియోగాలను రూపొందించాల్సి ఉందని కానీ అలాంటిదేమీ జరగలేదని ధర్మాసనం దృష్టికి ఏబీ వెంకటేశ్వరరావు న్యాయవాది తెచ్చారు.

రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే తన పిటిషనర్‌ను బదిలీ చేసి జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశించిన విషయాన్ని ఆయన హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఆ తర్వాత కొంత కాలానికి సస్పెండ్ చేశారని చెప్పారు.గత ఏడాది మే 30 వ తేదీన సస్పెండ్ చేశారని, అప్పటి నుండి ఇంతవరకు జీతభత్యాలు ఇవ్వని విషయాన్ని ఆయన కోర్టుకు తెలిపారు.

ఈ ఏడాది ఫిబ్రవరి 8వ తేదీన జీఏడీ జారీ చేసిన 18 నెంబర్ జీవోను,  మార్చి 17న క్యాట్ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని ఏబీ వెంకటేశ్వరరావు న్యాయవాది కోర్టును కోరారు. దీంతో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

click me!