ఏపీ ప్రభుత్వం ఈ రోజు మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రోజు నుంచే దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. వచ్చే నెల 15 నుంచి 30వ తేదీల మధ్య పరీక్షలు నిర్వహిస్తున్నది.
AP DSC Notification: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఓ తీపి కబురు చెప్పింది. సోమవారం ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం 6,100 పోస్టులతో నోటిఫికేషన్‌ను విడుదల చేశారు.
ముఖ్య సమాచారం:
ఏపీ ప్రభుత్వం మొత్తం 6,100 ఉద్యోగాల నియామకాలకు రంగం సిద్ధం చేసింది. ఇందులో 2,29 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. 2,280 ఎస్జీటీ పోస్టులు, 1,264 టీజీటీ పోస్టులు, 215 పీజీటీ పోస్టులు, 42 ప్రిన్సిపాల్ పోస్టు ఉన్నాయి.
ఈ పోస్టుల భర్తీకి 2018 సిలబస్ ప్రకారమే పరీక్షలు నిర్వహించనున్నారు. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 44 సంవత్సరాలుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఇక రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు మరో ఐదేళ్ల వయోపరిమితిని పెంచారు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ https://cse.ap.gov.in/ను సందర్శించి తెలుసుకోవచ్చు.
Also Read: TDP: టీడీపీకి ఘోర పరాభవం.. 41 ఏళ్లలో తొలిసారి పెద్ద సభలో టీడీపీ నిల్
ముఖ్య తేదీలు:
ఈ రోజు నుంచే మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌కు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అవుతున్నది. ఈ నెల 12వ తేదీ నుంచి 22వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. అయితే.. ఫీజు చెల్లింపునకు గడువు మాత్రం ఒక రోజు ముందే అంటే 21వ తేదీతోనే ముగుస్తుంది. మార్చి 5వ తేదీ నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
ఇక మార్చి 15వ తేదీ నుంచి మార్చి 30వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తొలి సెషన్ ఉంటుంది. ఇక రెండో సెషన్ మధ్యాహ్నం 2.30 గంటలకు మొదలై 5 గంటలకు ముగుస్తుంది.