జీతాలు, పెన్షన్ బిల్లుల ప్రక్రియపై మరోసారి ఏపీ ఆర్థిక శాఖ సర్క్యులర్.. అందులో ఏం చెప్పిందంటే..

By Sumanth KanukulaFirst Published Jan 27, 2022, 1:42 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) జారీచేసిన PRC జీవోలకు వ్యతిరేకంగా ఉద్యోగులు సమ్మెకు సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు ప్రభుత్వం కొత్త పీఆర్సీ అమలుకు సిద్దమం అవుతుంది. తాజాగా జీతాలు, పెన్షన్ బిల్లుల ప్రక్రియపై ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మరోసారి సర్క్యులర్ జారీచేసింది

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) జారీచేసిన PRC జీవోలకు వ్యతిరేకంగా ఉద్యోగులు సమ్మెకు సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు ప్రభుత్వం కొత్త పీఆర్సీ అమలుకు సిద్దమం అవుతుంది. తాజాగా జీతాలు, పెన్షన్ బిల్లుల ప్రక్రియపై ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మరోసారి సర్క్యులర్ జారీచేసింది. కొత్త పే స్కేలు ప్రకారమే ఉద్యోగులకు జీతాలు, పెన్షర్లకు పింఛన్లు చెల్లించాలని అందులో స్పస్టం చేసింది. కొత్త పీఆర్సీ జీవోల ప్రకారమే జనవరి వేతనాలు, పింఛన్లను చెల్లించాలని పేర్కొంది. జీతాలు, పెన్షన్ల బిల్లులు ప్రాసెస్ చేయకుంటే క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించింది.

నిర్దేశించిన సమయంలోగా బిల్లులను ప్రాసెస్‌ చేయాలని, ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఈ మేరకు సచివాలయ శాఖలు, శాఖాధిపతులు, ట్రెజరీ, పే అండ్‌ అకౌంట్స్‌ కార్యాలయాలకు ఆర్థిక శాఖ సర్క్యులర్‌ మెమో జారీ చేసింది. జీవోలకు విరుద్ధంగా వ్యవహరించడానికి వీల్లేదని, ఎటువంటి ఉల్లంఘనలకు పాల్పడకూడదని స్పష్టం చేసింది. ఈరోజు సాయంత్రంలోగా బిల్లులను అప్‌లోడ్ చేయాలని డీడీఓలకు సూచించింది. రేపటిలోగా అప్‌లోడ్ చేసిన బిల్లులను ప్రాసెస్ చేయాలని పీఏఓలను ఆదేశించింది. ఫిబ్రవరి 1న జీతాలు జమయ్యేలా చూడాలని ట్రెజరీ అధికారులకు ఆదేశాలు జారీచేసింది.

ఆ సర్క్యులర్‌లో.. ప్రభుత్వశాఖలు, విభాగాలు, విశ్వవిద్యాలయా లు, సొసైటీలు, మోడల్‌ స్కూళ్లలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ప్రకారం సవరించిన మినిమమ్‌ టైమ్‌స్కేల్‌ మేరకు జనవరి వేతనాలు చెల్లించాలని తెలిపింది.  ఫుల్‌ టైమ్, ఎన్‌ఎంఆర్, రోజువారీ వేతనాలు, కన్సాలిడేటెడ్, పార్ట్‌ టైమ్‌ ఉద్యోగులకు కూడా కొత్త పీఆర్సీ ప్రకారం మినిమమ్‌ టైమ్‌స్కేల్‌ మేరకు జనవరి వేతనాలను చెల్లించాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న పొరుగుసేవల ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ప్రకారం సవరించిన వేతనాలపై జారీ చేసిన జీవో ప్రకారం జనవరి వేతనాలను ఫిబ్రవరిలో చెల్లించాలని పేర్కొంది.  

ఇక, ఇప్పటికే కొత్త పే స్కేళ్లతో జీతాలు చెల్లించేందుకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే. 11వ పీఆర్సీ ప్రకారమే కొత్త పే స్కేళ్లతో జనవరి నెల జీతాలు చెల్లించేందుకు బిల్లులు తయారు చేయాలని ఉత్తర్వులు జారీచేసింది.

మరోవైపు కొత్త పీఆర్సీ అమలును ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. పాత పీఆర్సీ ప్రకారమే జనవరి నెల వేతనాలు చెల్లించాలని వారు కోరుతున్నారు. కొత్త పే స్కేలు అమలు చేస్తే ఉద్యోగ సంఘాలు కూడా దానిని అంగీకరించినట్టుగానే అవుతుందని ఉద్యోగ సంఘాల నేతలు భావిస్తున్నారు. కొత్త పీఆర్సీ అమలు కుదరదని ఉద్యోగ సంఘాల నాయకులు చెబుతున్నారు. ట్రెజరీ అధికారులు, పే అండ్‌ అకౌంట్స్‌, డీడీవోలు కొత్త పే స్కేల్ ప్రకారం జీతాలు ప్రాసెస్ చేయడానికి అంగీకరించడం లేదు. 

అయితే ప్రభుత్వం నుంచి కొత్త పీఆర్సీ అమలు చేయాల్సిందేనని వరుసగా ఆదేశాలు వెలువడుతున్నాయి. దీంతో ట్రెజరీ ఉద్యోగుల పైన ఒత్తిడి పెరుగుతోంది. ఈ క్రమంలోనే అసలు జనవరి జీతం విషయంలో ఏం జరుగబోతుందనేది ఆసక్తిగా మారింది. 

click me!