జగన్ సిద్దమే అంటే... మేమూ సిద్దమే అంటున్న పవన్ : ప్లెక్సీ పాలిటిక్స్ మామూలుగా లేవుగా..!

By Arun Kumar P  |  First Published Jan 31, 2024, 9:57 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అధికార వైసిపి,  ప్రతిపక్ష టిడిపి-జనసేన కూటమి సరికొత్తగా ప్లెక్సీ వార్ ప్రారంభించాయి. 


అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ లో అసెంబ్లీ, దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. దీంతో గతంలో మాదిరిగానే ఎన్నికల్లో విజయం సాధించాలని వైసిపి, గత పలితాన్ని రిపీట్ కానివ్వకూడదని టిడిపి, జనసేన భావిస్తున్నాయి. దీంతో ఎన్నికల షెడ్యూల్ వెలువడకముందే ఏపీ ఎలక్షన్ మూడ్ లోకి వెళ్లిపోయింది. గెలుపే లక్ష్యంగా అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహప్రతివ్యూహాలు, ఎత్తులు పైఎత్తులతో సంసిద్దం అవుతున్నాయి. ఇప్పటికే ప్రచారాన్ని హోరెత్తిస్తున్న ప్రధానపార్టీల మధ్య ఇప్పుడు 'మేం సిద్దమే అంటే మేమూ సిద్దమే' అంటూ ప్లెక్సీ వార్ మొదలయ్యింది. వైసిపి ఎన్నికలకు సిద్దమే అంటుంటే టిడిపి, జనసేన పార్టీలు మేమూ సిద్దమే అంటూ ప్లెక్సీలు ఏర్పాటుచేసాయి. ఇలా పక్కపక్కనే అధికార, ప్రతిపక్షాల ప్లెక్సీల ఏర్పాటుతో ఏపీలో పొలిటికల్ హీట్ పెరిగింది.  

ఏపీ ముఖ్యమంత్రి, వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 'సిద్దం' పేరిట ఎన్నికల ప్రచారపర్వాన్ని ప్రారంభించారు. ఇటీవల భీమిలిలో భారీ బహిరంగ సభ ద్వారా తాము ఎన్నికలకు సిద్దమే అంటూ జగన్ ప్రకటించారు. వైసిపి లీడర్లు, క్యాడర్ లో జోష్ నింపుతూ ఎన్నికలకు సమాయత్తం కావాలని సూచించారు. ఇదే 'సిద్దం' నినాదాన్ని ఎన్నికల ప్రచారంలో వాడుకోవాలని వైసిపి చూస్తుంటే 'మేము సిద్దమే' అంటూ కౌంటర్ ఎటాక్ ప్రారంభించింది టిడిపి, జనసేన కూటమి. 

Latest Videos

విజయవాడ వైసిపి శ్రేణులు సీఎం జగన్ ఫోటోలతో ఎన్నికలకు సిద్దమే అంటూ భారీ ప్లెక్సీ ఏర్పాటుచేసారు. కృష్ణలంక జాతీయ రహదారిపై వెలిసిన వైసిపి ప్లెక్సీకి కౌంటర్ గా పక్కనే జనసేన కూడా మరో ప్లెక్సీ ఏర్పాటుచేసింది. పవన్ కల్యాణ్ తో పాటు వంగవీటి మోహనరంగా ఫోటోతో 'మేము సిద్దమే' అంటూ ప్లెక్సీలు ఏర్పాటుచేసారు. ఇలా మొదలైన ప్లెక్సీ వార్ రాష్ట్రంలోని ఇతరప్రాంతాలకు పాకింది. వైసిపి, టిడిపి-జనసేన కూటమి పోటాపోటీగా ప్లెక్సీలు ఏర్పాటుచేయడంతో ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నారు. 

 Also Read స్పీకర్ నిర్ణయంపై ఉత్కంఠ:ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్న టీడీపీ, వైఎస్ఆర్‌సీపీ

విజయవాడలో మొదలైన ప్లెక్సీ వార్  మరింత ముదిరింది. నిన్న(మంగళవారం) తమకు పోటీగా జనసేన ఏర్పాటుచేసిన ప్లెక్సీకి మరో ప్లెక్సీతో కౌంటర్ ఇచ్చింది వైసిపి. 'మేము 175 స్థానాల్లో పోటీచేసి గెలవడానికి మేము సిద్దమే... పోటీ చేయడానికి మీరు సిద్దమా..!' అంటూ జనసేనను ప్రశ్నించారు. అయితే గత అర్ధరాత్రి వైసిపి ప్లెక్సీలను అలాగే వుంచిన పోలీసులు జనసేన ప్లెక్సీలను మాత్రం తొలగించారు. దీంతో విజయవాడ పోలీసుల తీరుపై జనసైనికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము ఏర్పాటుచేసిన ప్లెక్సీలను ఎందుకు తొలగించారని పోలీసులను ప్రశ్నిస్తున్నారు. వైసిపి ప్లెక్సీలను కూడా వెంటనే తొలగించాలని జనసైనికులు డిమాండ్ చేస్తున్నారు. 

 ఇదిలావుంటే ఈ ప్లెక్సీ వివాదం గుడివాడకు పాకింది. పట్టణంలోని రాజబాపయ్య చౌక్ లో టిడిపి నాయకులు 'సై' అంటూ ప్లెక్సీలు ఏర్పాటుచేసారు. వెంటనే మున్సిపల్ సిబ్బంది ఈ ప్లెక్సీలను తొలగించే ప్రయత్నం చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. టిడిపి, జనసేన నాయకులు అక్కడికి చేరుకుని మున్సిపల్ సిబ్బందిని అడ్డుకునే ప్రయత్నం చేసారు.అంతేకాదు మున్సిపల్ కార్యాలయానికి ర్యాలీగా బయలుదేరగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే డిఎస్పీ శ్రీకాంత్, టిడిపి, జనసేన నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఎలాంటి అనుమతులు లేకుండా రెచ్చగొట్టేలా ప్లెక్సీలు ఏర్పాటుచేయడంపై మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారని డిఎస్పీ తెలిపారు. కానీ టిడిపి, జనసేన శ్రేణులు మాత్రం వైసిపి నాయకులే వెనకుండి ఇదంతా చేయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. 

వీడియో

click me!