Earthquake: చిత్తూరు జిల్లాలో మరోసారి భూప్రకంపనలు.. విపరీతమైన శబ్దాలు..

By Sumanth KanukulaFirst Published Dec 8, 2021, 11:54 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలో (chittoor district) కొద్ది రోజులుగా భూ ప్రకంపనలు జనాలకు కంటి మీద కునుకు లేకండా చేస్తున్నాయి. తాజాగా మరోసారి భూప్రకంపలు (earthquake) చోటుచేసుకోవడంతో జనాలు ఆందోళన చెందుతున్నారు. 

ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలో (chittoor district) కొద్ది రోజులుగా భూ ప్రకంపనలు జనాలకు కంటి మీద కునుకు లేకండా చేస్తున్నాయి. తాజాగా మరోసారి భూప్రకంపలు (earthquake) చోటుచేసుకోవడంతో జనాలు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని రామకుప్పం మండలంలో అర్థరాత్రి నుంచి పలుమార్లు భూప్రకంపనలు వచ్చాయి. మండలం పరిధిలోని గడ్డురు, గెరిగిపల్లె, గొరివిమాకుల పల్లి, యనాది కాలనీ, కృష్ణ నగర్, పెద్దగరిక పల్లి ప్రాంతాల్లో విపరీతమైన శబ్దాలు వినబడుతున్నాయి. దీంతో జనాలు ఇళ్లు వదిలి రోడ్లపైకి, పొలాల వద్దకు పరుగులు తీశారు. అర్ధరాత్రి నుంచే ప్రజలు బయటే జాగారం చేస్తున్నారు. 

భూమి పొరల నుంచి శబ్దాలు వినపడంతో జనాలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ఈ భూప్రకంపనల నేపథ్యంలో కొన్ని ఇళ్లలోని వస్తువులు కిందపడిపోయాయి. గోడలకు పగుళ్లు రావడమే కాకుండా బీటలు వారుతున్నాయి. ఈ క్రమంలోనే జనాలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీస్తున్నారు. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక ఆందోళన పడుతున్నారు. అధికారులు స్పందించాలని కోరుతున్నారు. 

10 రోజుల కిందట కూడా రామకుప్పం మండలంలో ఇలా వరసుగా భూప్రకంపనలు వచ్చిన సంగతి తెలిసిందే. పంద్యాలమడుగు, గొరివిమాకులపల్లె, బందార్లపల్లె పంచాయతీ పరిధిలోని గడ్డూరు, యానాదికాలనీల్లో భూప్రకంపనలు వచ్చాయి. దీంతో ఆందోళన చెందిన  జనాలు కొందరు ఇళ్లు వదిలి బంధువుల ఇళ్లకు వెళ్లారు. ఆ సమయంలో స్పందించిన అధికారులు.. గత కొద్ది రోజులుగా కురిసిన వర్షాలతో జలాలు భూమిలోకి ఇంకే క్రమంలో భూమి కంపించినట్టు తెలుస్తుందన్నారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. 

అయితే తాజాగా మరోసారి భూప్రకంపనలు చోటుచేసుకోవడం, వింత శబ్దాలు వస్తుండటంతో జనాలు తీవ్ర భయాందోనలు చెందుతున్నారు. అధికారులు స్పందించి ఈ సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతున్నారు.

click me!