తస్మాత్ జాగ్రత్త... ఆ జిల్లాల్లో పిడుగులు పడే ప్రమాదం..: ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ

By Arun Kumar PFirst Published May 30, 2023, 11:48 AM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ లోని పలు జిల్లాల్లో మరికొద్దిసేపట్లో వర్షాలు మొదలవడంతో పాాటు పిడుగులు పడే అవకాశాలున్నాయని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. 

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ లో ఇవాళ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే ప్రమాదం వుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. వ్యవసాయ పనులకోసం పొలాలకు వెళ్లే రైతులు, కూలీలతో పాటు పశువులు, గొర్లు, మేకల కాపరులు అప్రమత్తంగా వుండాలని... వర్షం కురిసే సమయంలో చెట్లకింద వుండరాదని సూచించారు. ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశాలున్నాయని విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. 

ఇదిలావుంటే తెలుగురాష్ట్రాల్లో మళ్ళీ వర్షాలు మొదలయ్యాయి. మండిపోతున్న ఎండలనుండి ఏపీ, తెలంగాణ ప్రజలకు చిరుజల్లులు ఉపశమనం కల్పిస్తున్నాయి. మరో నాలుగైదు రోజులు వర్షాలు ఇలాగే కొనసాగనున్నాయని... దీంతో ఉష్ణోగ్రత తగ్గనుందని వాతావరణ శాఖ ప్రకటించింది.   

నిన్న(సోమవారం) రాత్రి తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వర్షం కురిసింది. పలుచోట్ల ఇవాళ(మంగళవారం) తెల్లవారుజాము వరకు కూడా వర్షం కురిసింది. ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన ఈ అకాల వర్షాలు పంటలను దెబ్బతీసి రైతులకు నష్టాలను మిగిలిస్తున్నాయి. గతకొంతకాలంగా కురుస్తున్న వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లో వేలాది ఎకరాల పంట దెబ్బతినడంతో పాటు చేతికందివచ్చిన ధాన్యం తడిసి పాడయిపోయాయి. దీంతో రైతులకు సాయం అందించేందుకు ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు ముందుకువచ్చాయి. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ఆర్థిక సాయం ప్రకటించారు ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్. 

Read More  తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు: కొనుగోలు కేంద్రాల్లో తడిసిన వరి ధాన్యం

ఇదిలావుంటే నైరుతి రుతుపవనాలు జూన్ 7 నుంచి  11 మధ్య తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించే అవకాశం ఉందని...  ఈసారి సాధారణ వర్షపాతమే నమోదవనుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) పేర్కొంది. జూన్ నెలాఖరు నుంచి రాష్ట్రంలో రుతుపవనాలు తీవ్రరూపం దాల్చనున్నాయి.  

రుతుపవనాల రాకతో మొదట్లో వర్షాలు తీవ్రంగా ఉంటాయనీ, అయితే ఆ తర్వాత జూలైలో వర్షాలు తగ్గుముఖం పడతాయని ఐఎండీ అధికారులు తెలిపారు.ఈ ఏడాది వార్షిక వర్షపాతం సాధారణం లేదా సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశాలున్నాయని ఐఎండి తెలిపింది. 
 

click me!