ఏపీ సీఎం వైఎస్ జగన్ విపక్షాలపై విమర్శలు గుప్పించారు. అవకాశం దొరికినప్పుడల్లా చంద్రబాబు సహా విపక్షాలపై విమర్శలు చేశారు.
పుట్టపర్తి:చంద్రబాబు పేరు చెబితే స్కిల్ డెవలప్ మెంట్, ఫైబర్ గ్రిడ్, మద్యం, ఇసుక కుంభకోణాలే గుర్తుకు వస్తాయని ఏపీ సీఎం వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు.చంద్రబాబు పేరు చెబితే మంచి స్కీమ్ గుర్తుకు వస్తుందా అని ఆయన ప్రశ్నించారు.14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఏనాడూ రైతుల గురించి ఆలోచన చేయలేదన్నారు. చంద్రబాబు ఏది ముట్టుకున్నా స్కాంలే అని ఆయన ఆరోపించారు. చంద్రబాబుకు దోచుకోవడం, దాచుకోవడం మాత్రమే తెలుసునన్నారు. రాష్ట్రాన్ని దోచుకోవడం కోసమే చంద్రబాబుకు అధికారం కావాలని సీఎం విమర్శించారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ రైతు భరోసా కింద రెండో విడత నిధులను మంగళవారంనాడు పుట్టపర్తిలో విడుదల చేశారు. 53 లక్షల 53 వేల మంది రైతులకు రూ. 2200 కోట్ల ఆర్ధిక సహాయం అందించారు.రైతు భరోసా కింద తొలి విడతలో రూ. 7500, మలివిడతలో రూ. 4 వేలను ప్రభుత్వం అందిస్తుంది. తొలి విడత నిధులను ఈ ఏడాది మే మాసంలో విడుదల చేశారు. రెండో విడత నిధులను ఇవాళ సీఎం విడుదల చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం జగన్ ప్రసంగించారు. రైతులు ఇబ్బందులు పడకూడదనే పెట్టుబడి సహాయం కింద రైతులకు ముందుగానే నిధులను అందిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడ పీఎం కిసాన్ డబ్బులు కూడ ఈ నెలలోనే అందించనుందని సీఎం జగన్ చెప్పారు. ఎకరానికి ప్రతి ఏటా రూ. 13, 500 పెట్టుబడి సహాయం అందిస్తామని వైఎస్ జగన్ తెలిపారు. ఈ నాలుగేళ్లలో రైతులకు పెట్టుబడి సహాయం కింద రూ. 33, 209.81 కోట్లు అందించిన విషయాన్ని సీఎం జగన్ గుర్తు చేశారు. ప్రతి విషయంలో అన్నదాతకు అండగా నిలిచినట్టుగా చెప్పారు.
undefined
14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు రైతులకు పెట్టుబడి సహయం చేయాలన్న ఆలోచన చేయలేదన్నారు. తమ ప్రభుత్వం మాదిరిగా చంద్రబాబు సర్కార్ సంక్షేమం అందించలేదని ఆయన ప్రశ్నించారు.
చంద్రబాబు సర్కార్, తమ ప్రభుత్వానికి ఉన్న తేడా చూడాలని వైఎస్ జగన్ ప్రజలను కోరారు. తాను సీఎంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నాలుగేళ్లో పుష్కలంగా వర్షాలు కురిసిన విషయాన్ని జగన్ చెప్పారు. కానీ, చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో అనావృష్టేనని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో వ్యవసాయానికి ఏడు గంటల పాటు విద్యుత్ ను కూడ అందించలేకపోయారని ఆయన విమర్శించారు.చంద్రబాబు సర్కార్ సున్నా వడ్డీ పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం చేసిందని ఆయన ఆరోపించారు. ఏ సీజన్ లో పంట నష్టం జరిగితే అదే సీజన్ లో ఇన్ పుట్ సబ్సిడిని అందిస్తున్న విషయాన్ని సీఎం జగన్ ప్రస్తావించారు.
ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలున్న గిరిజన రైతులకు రైతు భరోసా అందించినట్టుగా సీఎం చెప్పారు. ఈ క్రాప్ ద్వారా ప్రతి రైతుకు మంచి జరిగేలా చేస్తున్నామన్నారు. ఆర్‌బీకే ద్వారా రైతుల సంక్షేమం కోసం పనిచేస్తున్నామన్నారు. రైతులకు రైతు భీమాను 53 మాసాల్లో రూ. 7582 కోట్లను చెల్లించినట్టుగా సీఎం జగన్ వివరించారు.గత నాలుగేళ్లలో రూ. 60 వేల కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేసిన విషయాన్ని జగన్ గుర్తు చేశారు.