
స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న World Economic Forum సదస్సులో సీఎం జగన్ బిజీబీజీగా గడుపుతున్నారు. నేడు రెండో రోజు సీఎం జగన్ పలువురు ప్రముఖులతో వరుసగా సమావేశం అవుతున్నారు. తాజాగా టెక్ మహీంద్రా ఎండీ, సీఈవో సీపీ గుర్నానీతో సీఎం జగన్ భేటీ అయ్యారు. దావోస్‌లో ఏర్పాటు చేసిన ఏపీ పెవిలియన్‌కి వచ్చిన సీపీ గుర్నానీతో సమావేశమైన జగన్ పలు అంశాలపై చర్చించారు. ఐటీ రంగాన్ని ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ఇక్కడి మానవ వనరుల లభ్యత గురించి సీఎం జగన్ ఆయనకు వివరించారు.
ఈ సమావేశం అనంతరం సీపీ గుర్నానీ మాట్లాడుతూ.. విశాఖపట్నాన్ని మేజర్ టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దాలని సీఎం జగన్ సంకల్పంతో ఉన్నట్టుగా చెప్పారు. ఇక్కడ నైపుణ్యాభివృద్ధిలో పెట్టుబడులు పెట్టాలని జగన్ కోరారని తెలిపారు. దీనికి గాను ఆంధ్రా వర్శిటీతో కలిసి పనిచేయాలని నిర్ణయించినట్టు టెక్ మహీంద్రా చైర్మన్ వెల్లడించారు. మానవ నైపుణ్యాలను పెంచేందుకు, హైఎండ్ టెక్నాలజీపై వచ్చే మూడు నెలల్లో ఆంధ్ర యూనివర్శిటీతో కలిసి ప్రత్యేక పాఠ్యప్రణాళికను రూపొందిస్తామన్నారు.
ఇక, ఈ రోజు ఉదయం వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో ఫ్యూచర్ ప్రూఫింగ్ హెల్త్ సిస్టమ్స్ అనే అంశంపై జరిగిన పబ్లిక్ సెషన్‌లో పాల్గొన్న సీఎం జగన్.. కోవిడ్ నియంత్రణకు తీసుకున్నచర్యలతో పాటు ఏపీలో వైద్య వ్యవస్థలో ఎలా బలోపేతం చేస్తుందని వివరించారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం తీరు తెన్నులను తెలియజేశారు. ‘‘కమ్యూనిటీ హెల్త్ ఇన్సూరెన్స్ లో కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ అనే పథకం అమలు చేస్తోంది. ఇందులో వెయ్యికి పైగా అనారోగ్య సమస్యలకు చికిత్స అందిస్తున్నారు. కానీ అంతకంటే మిన్నగా ఏపీలో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం అమలు చేస్తున్నాం. ఇందులో ఏకంగా 2,446 అనారోగ్య సమస్యలకు చికిత్సలో అందిస్తున్నాం. ఐదు లక్షల కంటే తక్కువ ఆదాయం కలిగిన1.44 కోట్ల కుటుంబాలకు ఈ పథకం ద్వారా సేవలు పొందుతున్నారు. గత మూడేళ్లలో దాదాపు 25 లక్షల కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందాయి’’ తెలిపారు. అని జగన్ చెప్పారు.
ఆ తర్వాత దస్సాల్ట్ సిస్టమ్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఫ్లోరెన్స్ వెర్జలెన్‌తో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌తో సానుకూల వాతావరణంలో సమావేశం జరిగిందన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా నైపుణ్యాలను ఎలా అభివృద్ధిచేయాలన్నదానిపై చర్చ జరిగినట్టు తెలిపారు. అదే విధంగా కొత్త తరహా ఇంధనాలపైనా కూడా సమావేశంలో చర్చించామన్నారు.