ఎమ్మెల్యే పదవికి జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. పులివెందులలో ఆయన రాజీనామా చేసి కడప పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లో గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించింది. గతంలో ఎన్నడూ లేనంతగా 151 స్థానాల్లో గెలిచి.. గడిచిన ఐదేళ్లపాటు సంక్షేమ పాలన అందించింది. అయితే, అనూహ్యంగా ఈసారి (2024) ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన వారిలో అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా 11 మంది మాత్రమే విజయం సాధించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కుతుందో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ప్రతిపక్ష హోదా కల్పించాలని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడికి వైసీపీ అధినేత జగన్ లేఖ రాశారు. అయితే, దీనిపై స్పీకర్ నుంచి అధికారికంగా ఎలాంటి స్పందన గానీ, ప్రకటన గానీ రాలేదు.
2019 ఎన్నికల్లో 23 అసెంబ్లీ సీట్లు సాధించిన తెలుగుదేశం పార్టీని వైసీపీ శాసనసభలో ఓ ఆటాడుకుంది. ఏకపక్ష ధోరణితో ప్రతిపక్ష సభ్యులను హేళన చేసి మాట్లాడింది. అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబునైతే కన్నీళ్లు పెట్టుకునే స్థితికి తీసుకొచ్చారు వైసీపీ ఎమ్మెల్యేలు. అయితే, ఇప్పుడు సీన్ అంతా రివర్స్ అయింది. గతంలో 23 సీట్లు గెలుచుకున్న టీడీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీలో చేరినా 19 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. అంటే అధికారికంగా ప్రతిపక్ష హోదా ఉన్నట్లే. అయినా చంద్రబాబుని, తెలుగుదేశం ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి పొమ్మనకుండానే పొగబెట్టారు వైసీపీ వాళ్లు. చంద్రబాబు అయితే శపథం చేసి మరి అసెంబ్లీని బహిష్కరించారు. ముఖ్యమంత్రి అయ్యాకే తిరిగి శాసనసభలో అడుగుపెట్టారు.
ఇప్పుడు తాను అసెంబ్లీకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందన్నది జగన్‌కి తెలియంది కాదు. 164 అసెంబ్లీ సీట్లు గెలుచుకున్న టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి సభ్యులు తనను ఏ రేంజ్‌లో ర్యాగింగ్ చేస్తారోనన్నది జగన్ అసెంబ్లీకి వెళ్తేగానీ తెలియదు. గతంలో చంద్రబాబుని ఇబ్బంది పెట్టినట్లే జగన్‌ను ఇప్పుడు ఆడుకోరన్న విషయంలో గ్యారెంటీ లేదు. ఈ నేపథ్యంలో వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కుతుందా..? మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి అసెంబ్లీలో అడుగు పెడతారా..? లేదా..? అన్న విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.
అయితే, ఎమ్మెల్యే పదవికి జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. పులివెందులలో ఆయన రాజీనామా చేసి కడప పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇలా జరిగితే అటు పులివెందుల అసెంబ్లీ స్థానానికి, ఇటు కడప లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతుంది. ఇటీవల మంగళగిరిలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన వైఎస్సార్ 75వ జయంతి వేడుకల్లో పాల్గొన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం కడప ఉప ఎన్నిక అంశాన్ని ప్రస్తావించారు. కడపలో ఉప ఎన్నిక వస్తే ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిలను గెలిపించుకునేందుకు ఊరూరా తిరిగి ప్రచారం చేసే బాధ్యత తీసుకుంటానని చెప్పారు. దీంతో జగన్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారన్న ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. ఇప్పటివరకు జరుగుతున్న ప్రచారంలో ఎంతో కొంత వాస్తవం ఉంటుందన్న బలం చేకూరింది.
అయితే, ఈ ఊహాగానాలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయి, వైసీపీ రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి తెరదింపారు. పులివెందుల ఎమ్మెల్యే పదవికి జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేసి.. ఎంపీగా పోటీ చేస్తారనే వార్తల్లో వాస్తవం లేదని చెప్పారు. అసలు జగన్ ఎందుకు రాజీనామా చేస్తారని ఆయన ప్రశ్నించడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది.