
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షల పేపర్స్ లీక్ ప్రచారం తీవ్ర కలకలం రేపుతోంది. వరుసగా మూడో రోజు పేపర్ లీక్ అయినట్టుగా వార్తలు రావడం విద్యార్థులను, తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశం కావడంతో ప్రభుత్వం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందనే మాట వినిపిస్తోంది. పదో పరీక్షలు ప్రారంభమైన బుధవారం తెలుగు పేపర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం ఆందోళనకు గురిచేసింది. అయితే అది లీక్ కాదని.. మాల్ ప్రాక్టీస్ అని విద్యా శాఖ పేర్కొంది. అయితే నంద్యాల జిల్లాలో 12 మందిని అరెస్ట్ చేయగా.. చిత్తూరు జిల్లాలో పదో తరగతి తెలుగు ప్రశ్నపత్రం బయటకు వచ్చిన ఘటనలో నారాయణ విద్యాసంస్థల వైస్ ప్రిన్సిపాల్ గిరిధర్, ఎన్‌ఆర్‌ఐ స్కూల్ ప్రిన్సిపాల్ సుధాకర్‌లను అదుపులోకి తీసుకున్నారు.
ఇక, నిన్న శ్రీకాకుళం జిల్లాలో హిందీ పేపర్ లీకేజీ అయినట్టుగా ప్రచారం జరిగింది. సరుబుజ్జిలి మండలంలోని రొట్ట వలస, సలంత్రీ పరీక్షా కేంద్రాల నుంచి హిందీ పేపర్ బయటకు వచ్చిందని ప్రచారం జరగడంతో.. కలెక్టర్ బి లఠ్కర్ వెంటనే విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జిల్లా విద్యాశాఖ అధికారి పగడాలమ్మ రొట్టవలస పరీక్షా కేంద్రానికి వచ్చి అధికారులను ఆరా తీశారు. పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని.. లీకేజీ వందతుల్లో వాస్తవం లేదని అన్నారు. వదంతులు వ్యాప్తి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదిలా ఉంటే నేడు నందికొట్కూరులో ఇంగ్లీష్ పేపర్ లీక్ అయినట్టుగా వార్తలు వస్తున్నాయి. గాంధీ మెమోరియల్ హైస్కూల్ నుంచి ఇంగ్లీష్ పేపర్ లీక్ అయింది. అటెండర్ ద్వారా పేపర్ లీక్ అయినట్టుగా ప్రచారం సాగుతుంది. దీంతో అప్రమత్తమైన కర్నూలు, నంద్యాల డీఈవోలు విచారణ చేపట్టారు. అయితే నేడు శ్రీ సత్యసాయి జిల్లా ఆమడగూరు పాఠశాల నుంచి ఇంగ్లిష్ పేపర్ లీకైనట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఆమడగూరులో పేపర్ లీక్ అయినట్టుగా జరుగుతున్న ప్రచారం అవాస్తవం అని విద్యాశాఖ తెలిపింది. ఎక్కడా పేపర్ లీక్ జరగలేదని విద్యాశాఖ, పోలీసులు చెబుతున్నారు. వదంతులు వ్యాప్తి చేసే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
పదో తరగలి ప్రశ్నపత్రాలు వాట్సాప్ గ్రూపుల్లో కనిపించడం, లీక్ అవుతున్నట్టుగా జరుగుతన్న ప్రచారంతో విద్యార్ధులు,వారి తల్లితండ్రులు ఆందోళనలకు గురవుతున్నారు. అయితే పేపర్ లీకేజ్ వార్తలను విద్యాశాఖ కొట్టివేసింది. పరీక్షా కేంద్రంలోకి సెల్‌ఫోన్లను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. పేపర్ లీకేజీ అయితే సెంటర్ సూపర్‌వైజర్ బాధ్యత వహించాల్సి ఉంటుందని పాఠశాల విద్యా కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు. ఇక, మాల్ ప్రాక్టీస్‌కు కారణమైన వారిని అరెస్ట్ చేస్తుంది. అయిన కూడా పేపర్ లీక్ ప్రచారం ఆగడం లేదు.
పేపర్ లీక్ వార్తలపై స్పందించిన విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.. ప్రశ్నాపత్రాలు లీక్ అనేది అవాస్తమని చెప్పారు. పరీక్ష ఉదయం 9.30కు ప్రారంభం అవుతుందని.. అంతకు ముందు పేపర్ బయటకు వస్తే లీక్‌గా భావిస్తారని చెప్పారు. నంద్యాలలో పేపర్ లీక్ అంటూ కుట్ర చేశారని చెప్పారు. ఒక వర్గం మీడియా అనవసరంగా పుకార్లను ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. ప్రశ్నాపత్రం లీక్ అయినట్టుగా వస్తున్న పుకార్లను నమ్మవద్దని ఆయన కోరారు.
కొలిమిగుండ్ల ఘటనలో 12 మంది అరెస్ట్..
ఇక, నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని అంకిరెడ్డిపల్లె జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో తెలుగు ప్రశ్నపత్రం లీక్ ఘటనకు సంబంధించి పోలీసులు గురువారం 12 మందిని అరెస్ట్ చేశారు. వారిలో 9 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. కర్నూలు రేంజ్ డీఐజీ ఎస్ సెంథిల్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. అంకిరెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అబ్దుల్లాపురం జెడ్పీ ఉన్నత పాఠశాల, గోరుమానుపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల, చింతలయాలపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల, కనకాద్రిపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల, రామకృష్ణ ఇంగ్లీషు మీడియం పాఠశాలల నుంచి పరీక్షలకు హాజరవుతున్న మొత్తం 183 మంది విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉత్తీర్ణులయ్యేలా ప్రశ్నాపత్రం లీక్ అయ్యేలా కొందరు ప్లాన్ వేశారు.
ప్రశ్నపత్రాలు లీక్ కావడంతో పాఠశాల ఉపాధ్యాయులు ఆరు పాఠశాలల్లోని ఇన్విజిలేటర్ల సాయంతో విద్యార్థులకు సమాధానాలు చెప్పేందుకు ప్రయత్నించినట్లు విచారణలో వెల్లడైంది. సమగ్ర విచారణ అనంతరం కర్నూలు రేంజ్ పోలీసులు తొమ్మిది మంది ఉపాధ్యాయులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిలో కె నాగరాజు, నీలకంఠేశ్వర రెడ్డి, ఆర్యభట్టు, ఎ పోతులూరు, మధు, దస్తగిరి, వెంకటేశ్వర్లు, వనజాక్షి, ఎస్ లక్ష్మి దుర్గతో పాటు మరో ముగ్గురిని టి రాజేష్, బొంతల మద్దిలేటి, రంగనాయకులు ఉన్నారు. మరోవైపు ఇది పేపర్ లీక్ కాదని, మాల్ ప్రాక్టీస్ అని విద్యాశాఖ అధికారులు చెప్పారు.