ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుకోసం తెలంగాణ కాంగ్రెస్ అనుసరించిన వ్యూహాన్నే ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. అయితే తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటుతర్వాత అమలుచేసిన ఓ పథకాన్ని జగన్ ఎన్నికలకు ముందే అమలు చేసేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది.
అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ బడ్జెట్ సమావేశాలతో పాటు ఎన్నికలకు ముందు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రి మండలి సమావేశాన్ని ఏర్పటుచేసారు. జనవరి 31న ఉదయం రాష్ట్ర సచివాలయంలో సీఎం జగన్ మంత్రులతో భేటీ కానున్నారు. ఈ మేరకు కేబినెట్ మీటింగ్ లో చర్చించాల్సిన అంశాలను రేపు ఉదయంలోపు ప్రతిపాదించాలని అన్ని శాఖలకు సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు.
వచ్చే నెల ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని జగన్ సర్కార్ భావిస్తోంది. ఈ క్రమంలోనే 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై చర్చించేందుకు మంత్రులతో సీఎం భేటీ అవుతున్నారు. అలాగే ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో ప్రజల్లోకి వైసిపి ప్రభుత్వాన్ని తీసుకెళ్లేందుకు సిద్దమయ్యారు. ఇప్పటివరకు జరిగిన అభివృద్ది, ప్రజాసంక్షేమాన్ని ప్రజలకు వివరించేందుకు ఎలా ముందుకు వెళ్లాలి అన్నదానిపై కూడా కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. అలాగే ఎన్నికలముందు సరికొత్త పథకాలను ప్రజలముందుకు తీసుకువచ్చేందుకు జగన్ సర్కార్ సిద్దమవుతోంది... వీటిపైనా కేబినెట్ భేటీలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
వచ్చేనెలలో వైఎస్సార్ చేయూత కింద డబ్బులు విడుదల చేయడంతో పాటు జగనన్న కాలనీల్లో ఇళ్లస్థలాల పంపిణీని ప్రభుత్వం చేపట్టనుంది. దీనిపై కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ పోస్టుల భర్తీకోసం నోటిఫికేషన్ విడుదలపై చర్చించనున్నారు. కేబినెట్ బేటీ అనంతరం మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
Also Read వైసిపికి కౌంట్ డౌన్ షురూ... 50-60 ఎమ్మెల్యేలు బయటకురావడం పక్కా..: గంటా శ్రీనివాసరావు
ఇక ప్రభుత్వ ఉద్యోగుల కొత్త పీఆర్సీ రిపోర్ట్ వచ్చేలోపు ఐఆర్ పై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వ నిర్ణయించింది. ఈ మేరకు ఉద్యోగుల ఐఆర్ పై మంత్రిమండలి చర్చించనుంది. ఉద్యోగుల డిమాండ్స్ ను పరిగణలోకి తీసుకుని ఐఆర్ నిర్ణయించనున్నారు.
గత ఎన్నికల సమయంలో ఇచ్చిన రైతుల వ్యవసాయ రుణాలను మాఫీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే ఈ రుణమాఫీ ప్రక్రియను పూర్తిచేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా వ్యవసాయ రుణాల మాఫీ విధి విధానాలపై ఈ కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం వున్నట్లు తెలుస్తోంది.
ఇక తెలంగాణలో మాదిరిగానే ఆంధ్ర ప్రదేశ్ లోనూ ఆర్టిసి బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే అంశంపైనా మంత్రిమండలిలో చర్చించే అవకాశాలున్నాయి. ఇప్పటికే దీనిపై ఆర్టిసి అధికారులతో ప్రభుత్వం సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. అయితే రాజకీయ పరిస్థితులను బట్టి ఈ ఉచిత బస్సు ప్రయాణంపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇలా బడ్జెట్ తో పాటు ఎన్నికలే టార్గెట్ గా కేబినెట్ భేటీ జరగనుంది.