ఏపీ సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం బుధవారం నాడు కొనసాగుతుంది. పలు కీలకాంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు.
అమరావతి:వైఎస్ఆర్ చేయూత స్టేటస్ రిపోర్ట్ పై ఏపీ కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన బుధవారం నాడు ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది..ఈ కేబినెట్ సమావేశంలో కీలక అంశాలపై చర్చిస్తున్నారు. గ్రేటర్ విశాఖ , ఆనకాపల్లి జిల్లాల్లో లక్ష ఇళ్ల నిర్మాణంపై సమావేశంలో చర్చించినట్టుగా సమాచారం. అంతేకాదు సచివాలయంలో 85 అదనపు పోస్టుల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. సీఆర్‌డీఏ చట్టంలో కొన్ని సవరణలను ఆమోదించనుంది. గ్రీన్ ఎనర్జీలో రూ. 81 వేల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. నాలుగు జిల్లాల్లో శాశ్వత లోక్ అదాలత్ ఏర్పాటుపై చర్చించారు.నెల్లూరు కర్నూల్, విజయనగరం, ప.గో జిల్లాల్లో శాశ్వత లోక్ అదాలత్ లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కూడా ఈ సమావేశాల్లో చర్చ జరిగినట్టుగా సమాచారం.
నెల్లూరు జిల్లా రామాయంపట్నం వద్ద 5,147 ఎకరాల్లో తయారీ పరిశ్రమ విషయమై కేబినెట్ లో చర్చించనున్నారు. కడప జిల్లా వొంగిమల్ల వద్ద అస్తా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్ సంస్థ ఆధ్వర్యంలో 1800 మెగావాట్ల హైడ్రో స్టోరేజీ పవర్ ప్రాజెక్టుపై చర్చించే అవకాశం ఉంది. కాకినాడ సెజ్ లో మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ కు కేబినెట్ ఆమోదం తెలపనుంది.