ఐఏఎస్ కొడుకు పెళ్లి.. ఖర్చు రూ.36వేలు మాత్రమే!

By ramya NFirst Published Feb 7, 2019, 3:11 PM IST
Highlights

పెళ్లి కుమార్తె తరఫువారు రూ.18 వేలు, పెళ్లి కుమారుడి తరఫువారు రూ.18 వేలు భరించనున్నారు. వివాహం, విందు భోజనాలకు కలిపి ఇదే ఖర్చు. 

పెళ్లి చేసి చూడు.. ఇళ్లు కట్టి చూడు అంటారు. ఎందుకంటే డబ్బు చేతిలో లేనిదే ఈ రెండూ జరగవు. ముఖ్యంగా పెళ్లి అంటే పందిళ్లు.. తప్పట్లు , తాళాలు, నగలు, దుస్తులు, విందు భోజనాలు, పెళ్లి మండం ఇలా ఒకటా, రెండా చాలా ఉంటాయి. పెళ్లి కుదిరిందంటే.. లక్షలకు లక్షలు చేతుల్లో నుంచి ఖర్చు కావాల్సిందే. సామాన్య, మధ్యతరగతి కుటుంబాల్లో పెళ్లే ఇలా ఉంటే.. ఒక ఐఏఎస్ అధికారి ఇంట్లో పెళ్లి అంటే ఆ హడావిడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సీఎం నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు ఫిల్మ్ స్టార్లు.. ఇలా అందరూ హాజరౌతారు. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా భారీగానే ఉంటాయి.

అయితే.. విశాఖపట్నంలోని ఓ ఐఏఎస్ అధికారి మాత్రం నేను పూర్తిగా భిన్నం అంటున్నారు. తన కొడుకు పెళ్లికి  కేవలం రూ.36వేలు మాత్రమే ఖర్చు పెడుతున్నట్లు ఆయన తెలిపారు. విశాఖ మెట్రో ప్రాంతీయ అభివృద్ధి మండలి కమిషనర్ బసంత్ కుమార్ కొడుకు వివాహం ఈ నెల 10వ తేదీన జరగనుంది. కాగా.. ఆయన కొడుకు పెళ్లికి పెడుతున్న ఖర్చు కేవలం రూ.36వేలు కావడం గమనార్హం.

పెళ్లి కుమార్తె తరఫువారు రూ.18 వేలు, పెళ్లి కుమారుడి తరఫువారు రూ.18 వేలు భరించనున్నారు. వివాహం, విందు భోజనాలకు కలిపి ఇదే ఖర్చు. ఈ నెల 8న నూతన వధూవరుల ఆశీర్వాద కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు హాజరవుతున్నారు. కేవలం కొడుకు పెళ్లి మాత్రమే కాదు.. గతంలో కూమార్తె పెళ్లి కూడా ఇదేవిధంగా నిరాడంబరంగా నిర్వహించారు. కుమార్తె వివాహానికి అయిన ఖర్చు రూ.16వేలు కావడం విశేషం. 

click me!