
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణ అరెస్ట్‌ను టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఖండించారు. నారాయణను అరెస్ట్ అక్రమం అని మండిపడ్డారు. మంగళవారం అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. జగన్ రెడ్డి తన అసమర్థ పాలన నుంచి దృష్టి మరల్చేందుకే ఈ అక్రమ అరెస్ట్‌లు అని విమర్శించారు. మూడేళ్ల పాలనలో కక్షసాధింపు చర్యలకే ప్రాధాన్యత ఇచ్చి.. టీడీపీ నేతలను అక్రమ అరెస్ట్‌లు, అక్రమ నిర్బంధాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. రాజకీయ కుట్రలో భాగంగానే నారాయణను అరెస్ట్ చేశారని విమర్శించారు. నారాయణ అక్రమ అరెస్ట్‌ను ఖండిస్తున్నట్టుగా చెప్పారు.
నోటీసులు ఇవ్వకుండా నారాయణను అరెస్ట్ చేశారని అన్నారు. టెన్త్ పేపర్ ఎక్కడ లీక్ కాలేదని అన్నారు.. మరి లీకేజ్ కేసులో నారాయణను ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. పరీక్షల నిర్వాహణలో ఏపీ ప్రభుత్వం విఫలమైందని.. ఆ నెపాన్ని నారాయణపై నెట్టారని ఆరోపించారు. అక్రమ అరెస్ట్‌ల పట్ల భవిష్యత్‌లో మూల్యం చెల్లించుకోక తప్పదని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.
ఇక, ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన పదో తరగతి పరీక్షల్లో పలుచోట్ల అవకవతవకలు చోటుచేసుకోవడం హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. పరీక్ష ప్రారంభమైన కొద్ది క్షణాల్లోనే ప్రశ్నపత్రాలు వాట్సాప్‌లో ప్రత్యక్షమయ్యాయి. పలుచోట్ల ప్రశ్నపత్రాల లీకేజ్ కేసుల్లో పలువురు ప్రభుత్వ ఉపాధ్యాయులు, సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు. టెన్త్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో నారాయణ విద్యాసంస్థలపై చిత్తూరు వన్‌టౌన్‌తో పాటు, కృష్ణా జిల్లా మండవల్లిలో కేసులు నమోదయ్యాయి. గత నెల చివరి వారంలో చిత్తూరు వన్ టౌన్‌లో ఎఫ్‌ఐఆర్ నెం. 111/2022, ఈ నెల 2వ తేదీన కృష్ణా జిల్లా మండవల్లిలో ఎఫ్‌ఐఆర్ నెం. 141/2022 కింద కేసులు నమోదయ్యాయి.
ఇక, తిరుపతిలోని నారాయణ స్కూల్స్ బ్రాంచీలో టెన్త్ క్లాస్ తెలుగు ప్రశ్నాపత్రం లీక్ అయింది. నారాయణ స్కూల్ కి చెందిన గిరిధర్ అనే టీచర్ లీక్ చేశారని పోలీసులు గుర్తించారు. ఇందుకు సంబంధించి డీఈవో ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి గిరిధర్‌తో పాటు పలువురని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ క్రమంలోనే నారాయణను మంగళవారం ఉదయం ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్‌లోని నారాయణ నివాసంలో ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఏపీకి తరలిస్తున్నారు. నారాయణ వెంట ఆయన భార్య రమాదేవి కూడా ఉన్నారు. నారాయణ దంపతులను ఆయన సొంత కారులోనే పోలీసులు ఏపీకి తరలిస్తున్నారు. మరోవైపు నారాయణపై ల్యాండ్ పూలింగ్ కేసు కూడా ఉన్న సంగతి తెలిసిందే. అయిలే నారాయణను ఏ కేసులో అరెస్ట్ చేశారనేదానిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇదిలా ఉంటే ఏపీలో టెన్త్ క్లాస్ పరీక్షల్లో పేపర్స్ లీకేజీకి సంబంధించి శ్రీచైతన్య స్కూల్స్ పాత్ర కూడా ఉందని స్వయంగా సీఎం జగన్ ఇటీవల తిరుపతి సభలో తెలిపారు. వ్యవస్థను నాశనం చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా ఇదే రకమైన వ్యాఖ్యలు చేశారు.