
ఇన్వెస్టర్లను పెద్ద ఎత్తున రాష్ట్రానికి ఆహ్వానించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మళ్లీ విదేశీయాత్రలు మొదలుపెట్టింది.
ఈ సారి 2017 జనవరిలో జరిగే ఆంధ్రప్రదేశ్- సిఐఐ పార్ట్ నర్ షిప్ సమ్మిట్ కోసం ఇన్వెస్టర్ లను బొట్టు పెట్టి సాదరంగా ఆహ్వానించాలనుకుంటున్నది ప్రభుత్వం. గతంలో రాజధాని అమరావతికి అయిడియాలను వెదుక్కుంటూ కొత్త రాజధానులున్న దేశాలన్నింటిని ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు జోరుగా తిరిగొచ్చారు. మధ్యలో టూరిజం కోసం, ఎర్రచందనం విక్రయించేందుకు ప్రపంచయాత్రలు చేశారు. ఇపుడు పెట్టుబడుల కోసం వెళ్తున్నారు. నవంబర్ డిసెంబర్ నెలల్లో అనేక బృందాలు ప్రపంచాన్ని చుట్టి రావాలని ప్రభుత్వం పురమాయిస్తున్నది.
ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ డెవెలప్ మెంట్ బోర్డు సిఇఒ జాస్తి కృష్ణ కిశోర్ అధ్వర్యంలో ఒక బృందం చైనా వెళుతున్నది. ఈ సదస్సు విశాఖలో వచ్చేజనవరి 27, 28 తేదీలలో జరుగుతుంది. కిశోర్ బృందం చైనాలోని గుయ్ యాంగ్ లో దిగింది. ఆయన అక్కడ అనేక రోడ్ షోలలో పాల్గొంటారు. అమరావతి రాజధానితో పాటు, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో పెట్టుబడులు పెట్టేందుకు చీనీ కంపెనీలను ఆయన ఆహ్వానిస్తారు.
దీనికోసం విశాఖ సదస్సులో పాల్గొనాలని కోరతారు. ఆయన బ్యాంక్ ఆఫై చైనా అధికారులను కలసి ఆంధ్ర ప్రదేశ్లో శాఖలు ఏర్పాటుచేయాలని కోరతారు. ఇదేవిధంగా కిశోర్ బృందం నవంబర్ 12న బీజింగ్ లోని పలు చైనా కంపెనీల ప్రతినిధులను కలసిరాష్ట్రం లో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాల గురించి వివరిస్తారు.