బావ హత్య కేసులో టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి అరెస్టు

By telugu teamFirst Published Mar 12, 2021, 2:35 PM IST
Highlights

అనపర్తి టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డిని పోలీసులు తూర్పు గోదావరి జిల్లా రామవరంలో అరెస్టు చేశారు. బావ సత్తిరాజు రెడ్డి హత్య కేసులో ఆయనను పోలీసులు అరెస్టు చేసి బిక్కవోలు పోలీసు స్టేషన్ కు తరలించారు.

కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా అనపర్తి టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. తూర్పు గోదావరి జిల్లాలోని రామవరంలో ఆయనను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. హత్య కేసులో ఆయన అరెస్టయ్యారు. 

రెండు నెలల క్రితం రామకృష్ణా రెడ్డి బావ సత్తీరాజు రెడ్డి హత్యకు గురయ్యారు. ఆయన సతీమణి ఫిర్యాదుతో పోలీసులు రామకృష్ణా రెడ్డిని అరెస్టు చేశారు. 

రెండు నెలల క్రితం సత్తిరాజు రెడ్డి అనుమానాస్ప స్థితిలో మరణించారు. అయితే, రామకృష్ణా రెడ్డిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ సత్తిరాజు రెడ్డి సతీమణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రామకృష్ణా రెడ్డిని బిక్కవోలు పోలీసు స్టేషన్ కు తరలించారు. 

హైకోర్టు న్యాయవాది శివారెడ్డి నివాసం వద్ద ఉన్న సమయంలో రామకృష్ణా రెడ్డిని అరెస్టు చేశారు. రామకృష్ణా రెడ్డి అరెస్టును నిరసిస్తూ టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి.

స్థానిక ఎమ్మెల్యే అవినీతిని ఎండగట్టినందుకే అనపర్తి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిపై కక్షసాధింపులో భాగంగా అక్రమ కేసులు బనాయిస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. .రామకృష్ణా రెడ్డి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. రాజారెడ్డి రాజ్యాంగంలో బాధితులకే శిక్ష అనడానికి అనపర్తి సంఘటన చక్కటి ఉదాహరణ అని అన్నారు.

సంబంధం లేని కేసులో ఇరికించే ప్రయత్నాలు ఎన్ని చేసినా చివరికి న్యాయమే గెలుస్తుందని లోకేష్ అన్నారు. కోర్టులో ఎన్ని సార్లు చివాట్లు తిన్నా కొంతమంది పోలీసులు వైసీపీ నాయకులకు వంతపాడుతూనే ఉన్నారని మండిపడ్డారు. చేస్తున్న ప్రతి తప్పుకి మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. తక్షణమే రామకృష్ణా రెడ్డిని విడుదల చెయ్యాలని డిమాండ్ చేశారు.

click me!