అనంతపురంలో ఘరానా మోసం.. రూ. 20 కోట్ల చిట్టీలు కట్టించిన మహిళ.. అర్దరాత్రి ఇళ్లు ఖాళీ చేసి వెళ్తుంటే..

By Sumanth KanukulaFirst Published Jan 23, 2022, 1:32 PM IST
Highlights

అనంతపురం జిల్లాలో ఘరానా మోసం వెలుగుచూసింది. బ్యూటీ పార్లర్ నిర్వహించే ఓ మహిళ వందలాది మహిళలతో చిట్టీలు కట్టించి.. వారిని బురిడి కొట్టించింది. దాదాపు రూ. 20 కోట్లు వసూలు చేసి మోసం చేసింది. అయితే ఆమె ఇళ్లు ఖాళీ చేసి వెళ్తుండగా బాధిత మహిళలు ఆమెను వెంబడించి పట్టుకున్నారు. 

అనంతపురం జిల్లాలో (Anantapur District) ఘరానా మోసం వెలుగుచూసింది. బ్యూటీ పార్లర్ నిర్వహించే ఓ మహిళ వందలాది మహిళలతో చిట్టీలు కట్టించి.. వారిని బురిడి కొట్టించింది. దాదాపు రూ. 20 కోట్లు వసూలు చేసి మోసం చేసింది. అయితే ఆమె ఇళ్లు ఖాళీ చేసి వెళ్తుండగా బాధిత మహిళలు ఆమెను వెంబడించి పట్టుకున్నారు. వివరాలు.. అనంతపురంలోని విద్యుత్ నగర్‌కు చెందిన జయలక్ష్మి సాయినగర్‌ మొదటి క్రాస్‌లో ఉమెన్స్‌ బ్యూటీ పార్లర్‌ నిర్వహించేది. స్థానికంగా ఉండే మహిళలతో చిట్టీలు నిర్వహించేది. అయితే ఆమె మాటలు నమ్మిన పలువురు మహిళ.. భారీగా చిట్టీలు కట్టారు. అయితే కొంతకాలంగా విజయలక్ష్మి వారికి డబ్బులు ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతోంది. చిట్టీల గడువు ముగిసినప్పటికీ .. డబ్బులు మాత్రం ఇచ్చేది కాదు. 

అయితే ఈ క్రమంలోనే  అర్ధరాత్రి జయలక్ష్మి ఇంటిని ఖాళీ చేసి వెళ్తుందనే సమాచారం తెలుసుకున్న బాధితులు ఆమెను వెంబడించి పట్టుకున్నారు. అనంతరం ఆమెను ఇటుకలపల్లి పోలీస్‌ స్టేషన్‌కు (Itikalapalli Police Station) తీసుకెళ్లారు. ఈ విషయం తెలుసుకన్న మరికొంత మంది బాధితులు కూడా పోలీసు స్టేషన్‌కు క్యూ కట్టారు. అయితే ఎస్ఐ రాఘవరెడ్డి తమపై ఆగ్రహం వ్యక్తం చేశారని బాధిత మహిళలు చెబుతున్నారు. న్యాయం చేయమని కోరితే.. ఎవరినడిగి చిట్టీలు వేశారంటూ మండిపడుతున్నారని తెలిపారు. 

జయలక్ష్మికి ఎస్సై వత్తాసు పలుకుతూ ఆమెను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని బాధిత మహిళలు ఆరోపించారు. ఎస్సై రాఘవరెడ్డి తీరుకు నిరసనగా పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఇదిలా ఉంటే.. ఇది సివిల్ కేసు అని, బాధితులు ఆధారాలతో కోర్టుకు వెళ్లాలని పోలీసులు సూచించారు. అయితే జయలక్ష్మిపై అనంతపురం పోలీస్ స్టేషన్లలో చెక్ బౌన్స్ కేసులు ఉన్నట్టుగా సమాచారం. 

పప్పుల చిట్టీల పేరుతో మోసం..
ఇటీవల ఇలాంటి ఘటనే ఒకటి విశాఖపట్నంలో చోటుచేసుకుంది. ఓ వ్యక్తి పప్పుల చిట్టీల పేరుతో ఘరానా మోసానికి పాల్పడ్డాడు. ఎలియాబాబు అలియాస్‌ రవి అనే వ్యక్తి పప్పుల చిట్టీల పేరుతో చిట్టీ వ్యాపారం మొదలుపెట్టారు. అయితే అతని నమ్మి ఎంతో మంది ఖాతాదారులు, ఏజెంట్లు రవి దగ్గర చిట్టీలు వేయడం మొదలు పెట్టారు. ఖాతాదారులకు, ఏజెంట్లను నమ్మకం కుదిరేంతవరకు మంచిగా నటించిన రవి.. 5 కోట్ల మేరకు వసూల్లు అవడంతో ఆ డబ్బుతో ఊడాయించాడు. దీంతో ఆందోళన చెందిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు.

click me!